అమెరికా బలహీనపడిందని ప్రత్యర్థి దేశాలు భావిస్తున్నాయి: ఒబామా

16-11-2020 Mon 16:53
  • ఓటమిని ట్రంప్ ఒప్పుకోవాలి
  • బైడెన్ కు కావాల్సినంత మెజార్టీ ఉంది
  • వ్యవస్థలను ట్రంప్ దెబ్బతీశారు
 It Is Time For Trump To Concede Says Barack Obama

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని డొనాల్డ్ ట్రంప్ అంగీకరించాలని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. ఫలితాలు వెలువడిన రోజు కానీ, మరో రెండు రోజుల తర్వాత కానీ ట్రంప్ తన ఓటమిని అంగీకరించి ఉంటే బాగుండేదని చెప్పారు. ఎన్నికల ఫలితాలలో వచ్చిన నంబర్లను చూస్తే... జో బైడెన్ అధ్యక్షుడు కావడానికి కావాల్సినంత మెజార్టీని సాధించారని తెలిపారు. ట్రంప్ తన అహాన్ని వీడి బైడెన్ కు అధికార పగ్గాలను అప్పగించాలని అన్నారు. దేశాధ్యక్షుడు అంటే ఒక ప్రజా సేవకుడని... కొంత కాలం మాత్రమే అధ్యక్షుడి కార్యాలయంలో ఉంటారని, అది పర్మినెంట్ పోస్ట్ కాదని చెప్పారు.

ఈ ఎన్నికల్లో దేశం రెండు భాగాలుగా విడిపోయిందని ఒబామా అన్నారు. అమెరికా సంయుక్త రాష్టాలుగానే మన దేశ విదేశాంగ విధానాలు ఉంటాయని... అమెరికా అసంయుక్త రాష్ట్రాలుగా విధానాలు ఉండవని చెప్పారు. డెమొక్రాట్లలో కానీ, రిపబ్లికన్లలో కాని ట్రంప్ లాంటి ప్రెసిడెంట్ ను తాను ఎన్నడూ చూడలేదని అన్నారు. వ్యవస్థలను ఆయన దెబ్బతీశారని చెప్పారు. ప్రస్తుత స్థితిలో ఉన్న ఓ ప్రజాస్వామ్య దేశాన్ని ముందుకు నడపడం ఆషామాషీ కాదని అన్నారు. నియమ, నిబంధనలను బేఖాతరు చేసే వ్యక్తి చేతిలో అధికారం ఎంతో కాలం ఉండబోదని చెప్పారు.

అమెరికా బలహీనపడిందని ప్రత్యర్థి దేశాలు భావిస్తున్నాయని... కొన్నేళ్లుగా దేశ రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలే దీనికి కారణమని ఒబామా అన్నారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కూడా మరొక కారణమని చెప్పారు. ఇవన్నీ చూసిన ప్రత్యర్థులు అమెరికాను కొల్లగొట్టడం సాధ్యమేననే నిర్ణయానికి వచ్చాయని తెలిపారు.