పాడుబడిన ఇంట్లో యువతి, యువకుడి మృతదేహాలు... ప్రేమ వ్యవహారమే కారణమా?

16-11-2020 Mon 15:59
  • జగిత్యాల రూరల్ మండలంలో ఘటన
  • మృతులు ప్రేమికులు అని ప్రాథమిక అంచనా
  • దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Two dead bodies in an old house

ఓ పాడుబడిన ఇంట్లో యువతి, యువకుడి మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో చూసిన పోలీసులు  సైతం దిగ్భ్రాంతికి గురైన ఘటన జగిత్యాల రూరల్ ప్రాంతంలో చోటుచేసుకుంది. మృతదేహాలు బాగా కుళ్లిపోవడంతో అక్కడ భయానక దృశ్యం కనిపించింది. హైదర్ పల్లెలోని ఓ పాడుబడిన ఇంటి నుంచి భరించలేని దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పరిశీలించగా, రెండు మృతదేహాలు కనిపించాయి. దాంతో వారు పోలీసులకు తెలిపారు.

పోలీసులు వచ్చి పరిశీలించగా, సంఘటన స్థలంలో ఓ యువతి, యువకుడి మృతదేహాలు పడివున్నాయి. అక్కడే పురుగుల మందు డబ్బా కూడా కనిపించింది. మొదట పురుగుల మందు తాగి, ఆపై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. వారిద్దరూ ప్రేమికులై ఉంటారని భావిస్తున్నారు. కాగా ఆ యువకుడిని హైదర్ పల్లె గ్రామానికి చెందిన మధు అనే యువకుడిగా గుర్తించారు. అతనితోపాటు చనిపోయిన అమ్మాయి ఎవరో తెలియరాలేదు.

వీరి ఆత్మహత్యలకు ప్రేమే కారణమా లేక ఇంకేమైనా వ్యవహారం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మధు 10 రోజుల నుంచి కనిపించకపోవడంతో అప్పుడే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని గ్రామస్తులు భావిస్తున్నారు.