Somu Veerraju: తమ డ్యూటీ చేసిన పోలీసులను అరెస్ట్ చేయడమేంటి?: నంద్యాల ఘటనపై సోము వీర్రాజు తీవ్ర వ్యాఖ్యలు

  • పాత నేరస్తుడ్ని విచారిస్తే తప్పేంటన్న సోము
  • టీడీపీ, వైసీపీలవి ఓటు బ్యాంకు రాజకీయాలని విమర్శ 
  • హిందువులు ఓటర్లు కారా? అని ప్రశ్నించిన ఏపీ బీజేపీ చీఫ్
Somu Veerraju objects the arrest of Police personnel in Nandyal suicide case

నంద్యాలలో అబ్దుల్ సలాం అనే ఆటోడ్రైవర్ తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడం ఇప్పటికీ ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. ఈ కేసులో సీఐ, హెడ్ కానిస్టేబుల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఈ చర్యను తప్పుబట్టారు.

అబ్దుల్ సలాం పాత నేరస్తుడు కాబట్టే ఓ చోరీ కేసులో అతడిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారించారని, ఆ తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. ఆత్మహత్య చేసుకునేందుకు ఎవరి కారణాలు వారికుంటాయని, కానీ డ్యూటీ చేసిన పోలీసులను అరెస్ట్ చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అంతమాత్రాన సీఎంను బాధ్యుడ్ని చేసి అరెస్ట్ చేస్తున్నారా? అని ప్రశ్నించారు.

ఈ వ్యవహారంలో చంద్రబాబు  ముస్లింలందరినీ సమీకరించి పెద్ద ఉద్యమం నడుపుతున్నాడని సోము వీర్రాజు ఆరోపించారు. అటు టీడీపీ, ఇటు వైసీపీ ముస్లిం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ కేసులో అరెస్ట్ అయిన వారికి టీడీపీయే బెయిల్ ఇప్పించి, మరోవైపు ముస్లింలను రెచ్చగొడుతుందని, మరోవైపు, ప్రభుత్వం తరఫున డీజీపీ మాట్లాడుతూ ఈ కేసులో ఎవరినీ వదలబోమని అంటాడని, అసలు వీళ్లకు ముస్లింలే ముఖ్యమా, హిందువులు ఓటర్లు కారా? అని వీర్రాజు నిలదీశారు.

More Telugu News