మూడవ కరోనా వేవ్ తగ్గిపోనుంది... లాక్ డౌన్ లేదన్న ఢిల్లీ సర్కారు!

16-11-2020 Mon 12:28
  • గరిష్ఠానికి చేరిన థర్డ్ కరోనా వేవ్
  • లాక్ డౌన్ విధింపు వార్తలు ఊహాగానాలే
  • పండగ వెళ్లిపోయింది కాబట్టి షాపింగ్ రద్దీ ఉండదు
  • ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్
Third Wave Corona Peaks and no Lockdown in Delhi says Minister

దేశ రాజధానిలో మూడవ కరోనా వేవ్ ఇప్పటికే గరిష్ఠానికి చేరిపోయిందని, ఇక, కేసులు తగ్గుముఖం పడతాయని, ఈ పరిస్థితుల్లో మరోమారు లాక్ డౌన్ విధించనున్నారన్న వార్తలు అవాస్తవమని, అటువంటి ఆలోచనేదీ తాము చేయడం లేదని ఢిల్లీ ఆరోగ్య శాఖా మంత్రి సత్యేంద్ర జైన్ ఈ ఉదయం వెల్లడించారు. లాక్ డౌన్ విధిస్తారని వస్తున్న వార్తలు ఊహాగానాలేనని ఆయన స్పష్టం చేశారు.

"మరో లాక్ డౌన్ కు అవకాశమే లేదు, నేను ఈ రోజు తెలియజేస్తున్నాను. ఢిల్లీలో కరోనా మూడవ వేవ్ వెళ్లిపోయినట్టే. మార్కెట్లను మూసివేయాలన్న ఆలోచనేమీ లేదు. పండగ వెళ్లిపోయింది కాబట్టి, షాపింగ్ రద్దీ కూడా అధికంగా ఏమీ ఉండదు" అని సత్యేంద్ర జైన్, ఈ ఉదయం మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. అయితే, ప్రజలు ఏమరుపాటుగా మాత్రం ఉండవద్దని, మాస్క్ లను ధరించే బయటకు రావాలని, గత లాక్ డౌన్ లో నేర్చుకున్న పాఠాలను మరువరాదని అన్నారు.

కాగా, ఢిల్లీలో ఆదివారం నాడు 3,235 కొత్త కొవిడ్-19 కేసులు నమోదు కాగా, 95 మంది వ్యాధి కారణంగా మరణించారని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. దీపావళి వారం రోజుల ముందు సగటున 21,098 టెస్టులు చేసిన వేళ, 7 వేల కేసులు రావడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆపై క్రమంగా కొత్త కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చింది.