పాక్ జైలు నుంచి 8 ఏళ్ల తర్వాత తిరిగొచ్చిన భారతీయుడు.. ఊరంతా దీపావళి!

16-11-2020 Mon 10:59
  • ఇంటికొచ్చిన యూపీ వాసి షంషుద్దీన్ 
  • సంబరాలు చేసుకున్న కుటుంబ సభ్యులు
  • గ్రామంలో సందడి వాతావరణం  
indian releases from pak jail

పాకిస్థాన్ లో గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయి, ఆ దేశ జైలులో ఎనిమిదేళ్ల పాటు గడిపిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన షంషుద్దీన్ అనే భారతీయుడు తిరిగొచ్చాడు. నిన్న రాత్రి ఆయన తన సొంతింటికి చేరుకుని ఆనందంగా గడిపాడు. అతడిని ఎనిమిదేళ్ల తర్వాత చూసిన కుటుంబ సభ్యుల ఆనందం అంబరాన్నంటింది.

ఆయనను చూసిన సోదరి ఆ ఆనందంలో కళ్లు తిరిగిపడిపోయింది. ఆయన వచ్చిన ఆనందంలో రెట్టింపు ఉత్సాహంతో సంబరాలు చేసుకోగా, అక్కడ దీపావళి వాతావరణం కనిపించింది. షంషుద్దీన్‌ను పాక్ భారత అధికారులకు అక్టోబరు 26నే  అప్పగించింది. అన్ని ప్రక్రియలు పూర్తి చేసుకునే వరకు ఇంత సమయం పట్టింది.

కాన్పూర్ పోలీసులు, నిఘా ఏజెన్సీ సభ్యులు అతడిని యూపీకి తీసుకువచ్చేందుకు అమృత్‌సర్ వెళ్లారు. నిన్న రాత్రి ఆయనను యూపీలోని బజరియా పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. అనంతరం ఆయనకు అక్కడ పోలీసులు స్వీట్లు తినిపించారు. తనకు ఇది అసలైన దీపావళి అని షంషుద్దీన్ అన్నాడు. తనకు కూతురు కూడా దీపావళి రోజునే పుట్టిందని చెప్పాడు. ఆయన రాకతో ఆయన గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.