బీహార్ మంత్రి వర్గంలో 17 మంది?.. నేడే ప్రమాణ స్వీకారం

16-11-2020 Mon 10:45
  • బీజేపీ నుంచి ఏడుగురు నేతలు
  • జేడీయూ నుంచి ఏడుగురు నేతలు ప్రమాణ స్వీకారం
  • వైశ్య వర్గానికి చెందిన తార్‌కిషోర్ ప్రసాద్ డిప్యూటీ సీఎం?
  • ఈబీసీ వర్గానికి చెందిన రేణు దేవికి కూడా ఆ బాధ్యతలు?
nitish takes oath today

బీహార్ సీఎంగా ఈ రోజు నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన 17 మందిని తన మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు తెలిసింది. ఇందులో మిత్రపక్షం బీజేపీ నుంచి ఏడుగురు నేతలు, జేడీయూ నుంచి ఏడుగురు నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

అలాగే, మిత్రపక్షాలు హిందుస్థాని అవామీ మోర్చా, వికాశీల్ ఇన్సాన్ పార్టీలకు మంత్రివర్గంలో చోటు దక్కనుంది. నితీశ్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వారు కూడా ప్రమాణస్వీకారం చేస్తారని తెలిసింది. అయితే, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఎవరు చేస్తారన్న విషయంపై ఇప్పటికీ  స్పష్టత రాలేదు.

వైశ్య వర్గానికి చెందిన తార్‌కిషోర్ ప్రసాద్, ఈబీసీ వర్గానికి చెందిన రేణు దేవికి ఈ బాధ్యతలు అప్పగిస్తారన్న ఊహాగానాలు వినపడుతున్నాయి. బీజేపీ సీనియర్ నేత సీఎం సుశీల్ కుమార్ మోదీ ఇంతకు ముందు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సారి ఆయన కాకుండా ఇతర నేతలను తీసుకునే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ సారి ఇద్దరు డిప్యూటీ సీఎంలను నియమించే అవకాశాలున్నాయి. భవిష్యత్తులో ఏ బాధ్యత అప్పగించినా శక్తిమేరకు పనిచేసేందుకు సిద్ధమని సుశీల్ మోదీ ట్వీట్ చేయడం గమనార్హం. ఆయనను రాజ్యసభ సభ్యుడిని చేసి, కేంద్ర కేబినెట్‌లో తీసుకునే అవకాశాలున్నాయని కూడా ప్రచారం జరుగుతోంది.