రాహుల్ గాంధీ ప్రచారం మానేసి సోదరి ఇంటికి పిక్‌నిక్‌కు వెళ్లారు: ఆర్జేడీ నేత విమర్శలు

16-11-2020 Mon 10:36
  • బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ మనసుపెట్టి ప్రచారం చేయలేదు
  • ప్రియాంక గాంధీ అసలు ప్రచారానికే రాలేదు
  • పార్టీని నడిపే విధానం ఇదేనా?
  • ఆర్జేడీ నేత శివానంద్ తివారీ తీవ్ర విమర్శలు
Rahul Gandhi was having a picnic during elections

బీహార్ శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన మహాకూటమిలో లుకలుకలు ప్రారంభమయ్యాయి. కూటమి ఓటమికి కాంగ్రెస్సే కారణమని ఆర్జేడీ సీనియర్ నేత శివానంద్ తివారీ విమర్శలు గుప్పించారు. 70 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపిన కాంగ్రెస్  వారి కోసం సభలు కూడా నిర్వహించలేకపోయిందని అన్నారు. రాహుల్ గాంధీ మూడు రోజులు మాత్రమే ర్యాలీల్లో పాల్గొన్నారని, ప్రియాంక గాంధీ అయితే అసలు ప్రచారానికే రాలేదని అన్నారు.

బీహార్‌తో పరిచయం లేదన్న కారణంతో ఇలా ప్రచారానికి రాకుండా ఉండడం తగదని అన్నారు. కాంగ్రెస్ ఎక్కడా మనసుపెట్టి పనిచేయలేదని చెప్పడానికి ఇది ఉదాహరణ అని అన్నారు. బీహార్‌లో ఎన్నికల ప్రచారం ఉత్కంఠగా సాగుతున్న వేళ రాహుల్ తన సోదరి ఇంటికి పిక్‌నిక్‌కు వెళ్లారని శివానంద్ తివారీ ఎద్దేవా చేశారు. పార్టీని నడిపే విధానం ఇదేనా? అని నిలదీశారు.