Depavali: దీపావళి పటాకులు... హోల్ సేల్ వ్యాపారులు సేఫ్... రిటైల్ వ్యాపారులకు నష్టం!

  • హైదరాబాద్ లో రూ. 250 కోట్ల వ్యాపారం
  • సుప్రీం ఆదేశాలు ప్రజలకు చేరడంలో ఆలస్యం
  • ఆదివారం నాడు కూడా సాగిన అమ్మకాలు
  • గతేడాదితో పోలిస్తే తగ్గిన వ్యాపారం
Wholesale Business is ok in Dewali Season

హైకోర్టు ఆదేశాలు, ఎన్జీటీ ఆంక్షల నేపథ్యంలో తొలుత భయపడినా, చివరికి దీపావళి పటాకుల వ్యాపారులను గట్టెక్కించింది. లాభాల విషయం పక్కనుంచితే, టోకు వ్యాపారులు మాత్రం నష్టపోలేదని తెలుస్తోంది. ఇదే సమయంలో రిటైల్ వ్యాపారులకు మాత్రం కొంత నష్టం తప్పలేదు. బాణసంచా విక్రయాలను జరపవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన తరువాత, క్రాకర్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించి కాస్త ఊరట పొందిన సంగతి తెలిసిందే.

తొలుత తమ అమ్మకాలకు ఏ విధమైన ఇబ్బందులూ ఉండబోవని భావించిన బాణసంచా వ్యాపారులు, భారీ ఎత్తున పటాకుల స్టాక్స్ ను తెచ్చుకుని పెట్టుకోగా, హైకోర్టు ఆదేశాలు వారికి అశనిపాతమయ్యాయి. వెంటనే అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఎన్జీటీ ఆదేశాలను అమలు చేయాలని, అయితే, గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవచ్చని ఊరటనిచ్చింది.

ఈ నేపథ్యంలో, ఒక్క హైదరాబాద్ లోనే రూ. 250 కోట్ల మేరకు వ్యాపారం జరిగింది. చివరి రెండు రోజుల పాటు జరిగిన విక్రయాలతో తాము గట్టెక్కామని క్రాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. అయితే, హోల్ సేల్ వ్యాపారులు గట్టెక్కినా, రిటైల్ గా స్వల్ప మొత్తాల్లో స్టాక్స్ కొని, గల్లీల్లో వ్యాపారం చేసిన వారు నష్టపోయారని తెలుస్తోంది. క్రాకర్స్ కొనుగోలు చేయాలా? వద్దా? అన్న మీమాంసలో ఉన్న పలువురు పటాకులు కొనేందుకు వెనుకాడారని తెలుస్తోంది.

ఇక గత సంవత్సరంతో పోలిస్తే 50 శాతం తక్కువ దుకాణాలు మాత్రమే తెరచుకోగా, సుమారు 70 శాతం వ్యాపారమే జరిగిందని వ్యాపారులు వెల్లడించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ప్రజలకు అందడంలో ఆలస్యం జరిగిందని, అయితే, దీపావళి తరువాత వచ్చిన ఆదివారం కూడా కొంత వ్యాపారం జరగడం తమకు మేలు కలిగించిందని వెల్లడించారు. తాము కూడా అధిక లాభాలను చూసుకోకుండా, పెట్టిన పెట్టుబడి వస్తే చాలన్నట్టు, తక్కువ ధరలకే టపాకాయలను విక్రయించామని తెలిపారు.

More Telugu News