ఆలయంలో పూజలు చేస్తూ కన్నుమూసిన మధ్యప్రదేశ్ మాజీ ఎమ్మెల్యే

16-11-2020 Mon 09:21
  • కార్డియాక్ అరెస్ట్‌తో కుప్పకూలిన వైనం  
  • మధ్యప్రదేశ్‌లోని బైతుల్‌లో ఘటన
  • ఆసుపత్రికి తరలించే సరికే ప్రాణాలు విడిచిన వినోద్ డాగా
Ex Congress MLA Vinod Daga Dies Of Cardiac Arrest

ఆలయంలో పూజలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే కార్డియాక్ అరెస్ట్‌తో ప్రాణాలు వదిలారు. మధ్యప్రదేశ్‌లోని బైతుల్‌లో జరిగిందీ ఘటన. బైతూల్ మాజీ ఎమ్మెల్యే, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ మాజీ కోశాధికారి అయిన వినోద్ డాగా ధన్‌తేరాస్ సందర్భంగా జైన్ దాదావాడీ (జైన్ టెంపుల్)ఆలయంలో పూజ చేసేందుకు వెళ్లారు.

ఆలయంలోని పార్శ్వనాథునికి పూజలు నిర్వహించిన ఆయన ఆ తర్వాత గురుదేవ్ మందిరంలో ప్రదక్షిణలు చేసి పూజలు నిర్వహించారు. గురుదేవ్ పాదాలకు నమస్కరించి, పక్కకు జరిగిన కొన్ని క్షణాల్లోనే కార్డియాక్ అరెస్ట్ కారణంగా కుప్పకూలిపోయారు. అదే సమయంలో ఆలయంలోకి వచ్చిన బాలుడు వినోద్ డాగా అచేతనంగా పడి ఉండడాన్ని చూసి పూజారికి చెప్పాడు.  

అప్రమత్తమైన పూజారి, ఇతర భక్తులతో కలిసి ఆయనను లేపే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆయన పూజలు చేస్తుండగా, మరణించిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.