హస్తినలో భారీ వర్షం, గాలులు... కొట్టుకుపోయిన కాలుష్యం!

16-11-2020 Mon 08:36
  • ఢిల్లీ వాసులను కరుణించిన వాతావరణ దేవుడు
  • కాలుష్యాన్ని నేలకు దింపిన వర్షం
  • వెల్లడించిన ఐఎండీ
Rain and Winds Reduced Delhi Pollutions

దేశ రాజధాని న్యూఢిల్లీలో దీపావళి తరువాత కాలుష్య స్థాయి అత్యంత ప్రమాదకర స్థాయికి చేరి, ప్రజల్లో తీవ్ర ఆందోళనను పెంచిన వేళ, వాతావరణ దేవుడు కరుణించాడు. నిన్నంతా కురిసిన వర్షాలు గాల్లోని కాలుష్య రేణువులను నేలకు దించగా, వీచిన ఈదురుగాలులు, పంజాబ్, హర్యానా నుంచి పంట వ్యర్థాలను కాల్చడం ద్వారా వస్తున్న కాలుష్యం దిశను మార్చి వేశాయి.

పశ్చిమ దిక్కు నుంచి గాలులు వీస్తూ, ఉత్తరం వైపు నుంచి వస్తున్న కాలుష్యాలను అడ్డుకుంటున్నాయని, ఇదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం, మరిన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు కురిశాయని సఫ్ధర్ జంగ్ అబ్జర్వేటరీ అధికారులు వెల్లడించారు. గాలి వేగం కూడా 40 కిలోమీటర్లకు పైగానే ఉండటంతో కాలుష్యం కొట్టుకు పోయిందని ఐఎండీ రీజనల్ వెదర్ ఫోర్ కాస్టింగ్ సెంటర్ హెడ్ కులదీప్ శ్రీవాత్సవ వెల్లడించారు.

ఆదివారం రాత్రి ఢిల్లీలో గాలి వేగం చాలా ఎక్కువగా ఉందని, గరిష్ఠంగా 29.1 డిగ్రీలు, కనిష్ఠంగా 11.4 డిగ్రీల సెల్సీయస్ వేడిమి నమోదైందని, ఇది సాధారణ ఉష్ణోగ్రతతో పోలిస్తే, రెండు డిగ్రీలు తక్కువని వెల్లడించారు. మరో వారంలో ఉత్తరాదిలో ఉష్ణోగ్రత రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకూ తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా ఢిల్లీలో కాలుష్యం తగ్గడంతో ప్రజలు కాస్తంత ఊపిరి పీల్చుకుంటున్నారు.