కేంద్ర మంత్రివర్గంలోకి సుశీల్ మోదీ.. రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా తార్ కిషోర్?

16-11-2020 Mon 07:47
  • బీహార్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన నితీశ్ కుమార్
  • బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకోవడంలో సుశీల్ మోదీ కీలక పాత్ర
  • కేంద్రమంత్రి వర్గంలోకి తీసుకోవడం సముచితమని భావన
Sushil Modi moves to Central says report

నితీశ్ కుమార్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సుశీల్ కుమార్ మోదీని ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని బీజేపీ అధిష్ఠానం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. బీహార్ శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది.

నితీశ్ కుమార్ మరోమారు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనుండగా, తార్ కిషోర్ ప్రసాద్ బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. నితీశ్ ప్రభుత్వంలో ఆయనను డిప్యూటీ సీఎంను చేసి, ఇప్పటి వరకు ఆ పదవిలో ఉన్న సుశీల్ మోదీని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకెళ్లాలని బీజేపీ అధిష్ఠానం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. బీహార్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు సాధించడంలో కీలక పాత్ర పోషించిన సుశీల్ మోదీని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడం సముచితమని అధిష్ఠానం భావిస్తున్నట్టు సమాచారం.