Donald Trump: ట్రంప్ అనుకూల, వ్యతిరేక వర్గాల బాహాబాహీ.. నిరసనలతో హోరెత్తుతున్న అగ్రరాజ్యం!

  • ఎన్నికల్లో పరాజయం పాలైనా ఓటమిని అంగీకరించని ట్రంప్
  • హింసాత్మకంగా మారిన వాషింగ్టన్‌ ర్యాలీ
  • నిరసనకారులను అదుపు చేసిన పోలీసులు
  • ట్రంప్ మరో నాలుగేళ్లు కొనసాగాల్సిందేనంటున్న మద్దతుదారులు
Trumpists Hold Rally In Washington DC

అమెరికాలో నిరసనలు హోరెత్తుతున్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన ట్రంప్, విజయం సాధించిన జో బైడెన్ వర్గీయులు రోడ్డెక్కి కొట్టుకుంటున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వాషింగ్టన్‌లో అయితే హింసాత్మక వాతావరణం నెలకొంది. పరాజయం పాలైనప్పటికీ ఓటమిని అంగీకరించేందుకు ట్రంప్ ససేమిరా అనడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ట్రంప్ అనుకూల వ్యతిరేక, వర్గాల మధ్య వాషింగ్టన్‌లో జరిగిన ఆందోళనలో ఒక ఆందోళనకారుడు, ఇద్దరు పోలీసులు గాయపడ్డారు.

ఎన్నికల్లో మోసం, అక్రమాలు జరిగాయని, ఫలితంగా కీలక రాష్ట్రాల్లో తనకు లక్షలాది ఓట్లు దక్కకుండా పోయాయని ట్రంప్ పదేపదే ఆరోపిస్తున్నారు. దీంతో ఆయన మద్దతుదారులు ట్రంపే గెలిచారంటూ శనివారం ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’( ఎంఏజీఏ) మార్చ్ నిర్వహించారు. ఓట్ల లెక్కింపుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ట్రంప్ మరో నాలుగేళ్లపాటు పదవిలో కొనసాగాలని నినాదాలు చేశారు.

మరోవైపు, ట్రంప్ వ్యతిరేక వర్గం కూడా రంగంలోకి దిగడంతో వాతావరణం వేడెక్కింది. వైట్‌హౌస్‌కు కొద్దిదూరంలో ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయి. ట్రంప్ మద్దతుదారులపై ఆయన వ్యతిరేక వర్గీయులు కోడిగుడ్లు విసిరారు. ప్లకార్డులు, బ్యానర్లు, టోపీలు లాక్కుని తగలబెట్టారు. అంతేకాదు, ఇరు వర్గాలు కర్రలతో దాడిచేసుకున్నాయి. పిడిగుద్దులు కురిపించుకున్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు.

More Telugu News