కరోనాతో బాధపడుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ను ఐసీయూకి తరలించిన వైద్యులు

15-11-2020 Sun 18:59
  • రాజకీయనేతలను కూడా వదలని కరోనా
  • ఇటీవల అహ్మద్ పటేల్ కు కరోనా పాజిటివ్
  • గురుగ్రామ్ మేదాంత ఆసుపత్రిలో చికిత్స
Doctors shifts corona infected Ahmed Patel to ICU

దేశవ్యాప్తంగా అనేకమంది రాజకీయనేతలు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ (71) కు కూడా కరోనా సోకింది. ఆయనకు ఇటీవల నిర్వహించిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దాంతో ఆయనను గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రిలో చేర్చారు. అయితే, మరింత మెరుగైన చికిత్స కోసం అహ్మద్ పటేల్ ను సాధారణ వార్డు నుంచి ఐసీయూకి తరలించారు. ఈ మేరకు అహ్మద్ పటేల్ తనయుడు ఫైజల్ పటేల్ వెల్లడించారు.

చికిత్స కొనసాగింపులో భాగంగా అహ్మద్ పటేల్ ను అత్యవసర చికిత్స విభాగానికి తరలించారని, ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని ఫైజల్ ట్వీట్ చేశారు. మేదాంత ఆసుపత్రి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతోందని, ఆయన ఆరోగ్యం కోసం అందరూ ప్రార్థించాలని కోరారు.