పోలవరం ప్రారంభానికి చంద్రబాబును కూడా పిలుస్తాం... వచ్చి ప్రాజెక్టు ఎత్తు కొలుచుకోవచ్చు: మంత్రి అనిల్ కుమార్

15-11-2020 Sun 18:07
  • మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియా సమావేశం
  • పోలవరం ఎత్తు తగ్గించారని చంద్రబాబుకు ఎవరు చెప్పారన్న అనిల్
  • చంద్రబాబుకు పోలవరంపై మాట్లాడే హక్కులేదని వ్యాఖ్యలు
Minister Anil Kumar slams Chandrababu in Polavaram issue

పోలవరం ప్రాజెక్టు అంశంపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. పోలవరం నిర్మాణంలో ఎలాంటి మార్పులు ఉండవని, పోలవరం ఎత్తు ఒక్క అంగుళం కూడా తగ్గించేది లేదని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించారంటూ చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని, పక్క రాష్ట్రంలో కూర్చుని కారుకూతలు కూస్తున్నారంటూ మండిపడ్డారు. ఎత్తు తగ్గించారని ఆయనకు చెప్పిందెవరు? అని ప్రశ్నించారు. కొన్ని పత్రికల సాయంతో పిచ్చిరాతలు రాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యాక ప్రారంభోత్సవానికి చంద్రబాబును కూడా పిలుస్తామని, ఆయనకు కొత్త బట్టలు పెడతామని మంత్రి అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు. ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు ఎత్తు కొలుచుకోవచ్చంటూ ఎద్దేవా చేశారు. అయినా, పోలవరంపై మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదని, ఏనాడైనా నిర్వాసితులతో మాట్లాడారా అని ప్రశ్నించారు. చంద్రబాబు కేవలం కమీషన్ల కోసమే ఆలోచించారని ఆరోపించారు.