చిన్న మచ్చ కూడా లేని పింక్ డైమండ్ కు అదిరిపోయే ధర!

15-11-2020 Sun 17:37
  • అరుదైన గులాబీరంగు వజ్రాన్ని వేలం వేసిన సోత్ బీ
  • స్విట్జర్లాండ్ లో వేలం
  • రూ.193 కోట్లకు కొనుగోలు చేసిన అజ్ఞాతవ్యక్తి
Pink diamond gets huge price in Sotheby auction

ప్రపంచంలో బంగారాన్ని మించిన ఖరీదైనది ఏదైనా ఉందంటే అది వజ్రమే. వజ్రం స్వచ్ఛత ఆధారంగా వాటి ధర నిర్ణయిస్తారు. ఎలాంటి లోపాలు లేని నికార్సయిన వజ్రాలకు కోట్లలో ధర పలుకుతుంది. తాజాగా స్విట్జర్లాండ్ లోని సోత్ బీ వేలం కేంద్రంలో నిర్వహించిన ఓ వేలంపాటలో అరుదైన భారీ పింక్ డైమండ్ కు అదిరిపోయే ధర వచ్చింది. ధగధగ కాంతులీనుతున్న ఈ గులాబీ రంగు వజ్రాన్ని వేలం వేయగా రూ.193 కోట్లకు అమ్ముడైంది.

'స్పిరిట్ ఆఫ్ ద రోజ్' అని పిలిచే ఈ వజ్రం 2017లో రష్యాలోని ఈశాన్య ప్రాంతంలో లభ్యమైంది. గనిలో లభ్యమైన సమయంలో దీని బరువు 27.85 క్యారట్లు కాగా, సానబట్టి మెరుగులు దిద్దిన అనంతరం ఆ బరువు 14.83 క్యారట్లకు తగ్గింది. రష్యాలో లభ్యమైన గులాబీ రంగు వజ్రాలన్నింటిలో ఇదే పెద్దది. సోత్ బీ తాజాగా నిర్వహించిన వేలంలో ఈ వజ్రాన్ని ఓ అజ్ఞాతవ్యక్తి కొనుగోలు చేశాడు.