ఈ నెల 17,18 తేదీల్లో మంగళగిరిలో జనసేన క్రియాశీలక సమావేశాలు

15-11-2020 Sun 17:20
  • క్రియాశీలక సభ్యత్వ నమోదుపై సమీక్ష
  • సభ్యులకు బీమా సర్టిఫికెట్లు అందించనున్న పవన్
  • పలు జిల్లాల ముఖ్యనేతలతో భేటీ
Janasena cadre will meet two days in Mangalagiri

ఈ నెల 17, 18 తేదీల్లో జనసేన పార్టీ క్రియాశీలక సమావేశాలు నిర్వహించనున్నారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ సమావేశాలకు పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హాజరవుతున్నారు.

అనంతపురం, నెల్లూరు రూరల్, మంగళగిరి, ఇచ్ఛాపురం, రాజోలు నియోజకవర్గాల క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం అయిన  నేపథ్యంలో ఈ నెల  17న ఉదయం 11 గంటలకు ఈ ఐదు నియోజకవర్గాలపై సమీక్ష చేపడతారు. క్రియాశీలక సభ్యులకు పార్టీ తరఫున అందిస్తున్న  బీమా సౌకర్యానికి సంబంధించిన సర్టిఫికెట్లను పవన్ ఈ సందర్భంగా అందించనున్నారు.

అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు గుంటూరు, తూర్పుగోదావరి, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల ముఖ్యనేతలతో పవన్ భేటీ కానున్నారు. ఇక, 18వ తేదీ ఉదయం 10 గంటలకు అమరావతి పోరాట సమితి నేతలు, అమరావతి మహిళా రైతులతో పవన్ సమావేశం అవుతారు. అనంతరం ఉదయం 11 గంటలకు మరో 32 నియోజకవర్గాల ఇన్చార్జిలతో సమావేశమై క్రియాశీలక సభ్యత్వం గురించి చర్చిస్తారు. కాగా, సభ్యత్వ నమోదు కోసం జనసేన ఐటీ విభాగం రూపొందించిన యాప్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ను పరిశీలించనున్నారు.