స్టేట్ బ్యాంకులో ఉద్యోగం కావాలా..! ఇదిగో నోటిఫికేషన్

15-11-2020 Sun 15:38
  • 2 వేల మంది ప్రొబేషనరీ ఆఫీసర్ల కోసం ఎస్బీఐ ప్రకటన
  • డిసెంబరు 4 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు
  • ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపికలు
SBI Notification for probationary officers

దేశంలో కరోనా పరిస్థితులు నెమ్మదిస్తుండడంతో ఉద్యోగ నియామకాల ప్రక్రియలు మళ్లీ ఊపందుకున్నాయి. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పెద్ద సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. 2,000 ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు ఎస్బీఐ తన నోటిఫికేషన్ లో వెల్లడించింది. ఇందులో జనరల్ కేటగిరీలో 810, ఓబీసీలకు 540, ఎస్సీలకు 300, ఎస్టీలకు 150, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 200 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. 21 నుంచి 30 ఏళ్ల లోపు వారై ఉండాలి. ఆన్ లైన్ లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అందుకు చివరి తేదీ డిసెంబరు 4. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

ప్రిలిమ్స్ పరీక్షలు డిసెంబరు 31 నుంచి 2021 జనవరి 5 వరకు జరుగుతాయి. జనవరి మూడో వారంలో ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడిస్తారు. ఆ తర్వాత జనవరి 29న మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి చివరి వారంలో మెయిన్స్ ఫలితాలు వస్తాయి. అదే నెలలో కానీ , మార్చి నెలలో కానీ ఇంటర్వ్యూలు చేపడతారు. పూర్తి వివరాలకు ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ sbi.co.in ను దర్శించాలి.