Malladi Vishnu: బూట్లు వేసుకుని పూజలు చేసిన చరిత్ర టీడీపీ నేతలది... స్వరూపానంద విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారు: మల్లాది విష్ణు

Malladi Vishnu fires on TDP leaders in Swaroopananda birthday celebrations matter
  • ఈ నెల 18న స్వరూపానంద జన్మదినం
  • ఆలయాల్లో వేడుకలు జరపాలన్న సర్కారు
  • ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతున్న టీడీపీ
  • గతంలో మీరు కూడా ఇవే ఆదేశాలిచ్చారన్న మల్లాది
విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానంద జన్మదిన (ఈ నెల 18) వేడుకలను రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో అధికారికంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్న సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు ఘాటుగా స్పందించారు. స్వరూపానంద స్వామి జన్మదిన వేడుకలను కూడా టీడీపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు.

2016లో స్వరూపానంద జన్మదిన వేడుకలపై టీడీపీ ప్రభుత్వం సర్క్యులర్ ఇవ్వలేదా? అని విష్ణు నిలదీశారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా వ్యవహరించడం టీడీపీకే చెల్లుతుంది అని విమర్శించారు. గత ప్రభుత్వం ఇదే విధంగా ఉత్తర్వులు ఇచ్చినప్పుడు తాము ఇస్తే అది ఎలా అభ్యంతరకరం అవుతుందని ప్రశ్నించారు. బూట్లు వేసుకుని పూజలు చేసిన చరిత్ర టీడీపీ నేతలదని అన్నారు.

గతంలో యనమల రామకృష్ణుడు స్వరూపానంద ఆశీస్సులు అందుకోలేదా? సుజనా చౌదరి, మురళీమోహన్ శారదాపీఠం వెళ్లి స్వరూపానందను కలవలేదా? అని మల్లాది విష్ణు నిలదీశారు. పీఠాధిపతులు, స్వామిజీలు ఏ పార్టీలకు చెందినవారు కానప్పుడు వాళ్లకు రాజకీయాలు అంటగట్టడం టీడీపీకి సరికాదని హితవు పలికారు. వరుస ఓటములతో బుద్ధి మందగించిన యనమల రామకృష్ణుడు దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయన ప్రెస్ నోట్ లకే పరిమితం అయ్యారని ఎద్దేవా చేశారు.
Malladi Vishnu
Swami Swaroopananda
Birthday
Telugudesam
Yanamala
YSRCP
Andhra Pradesh

More Telugu News