విలియమ్సన్ ను తీసేస్తారంటూ ప్రచారం...  సన్ రైజర్స్ తోనే ఉంటాడన్న వార్నర్

15-11-2020 Sun 13:43
  • హైదరాబాదు జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న కేన్ విలియమ్సన్
  • విలియమ్సన్ ను జట్టులోనే ఉంచాలన్న అభిమానులు
  • తాను కూడా అదే కోరుకుంటానని వార్నర్ వెల్లడి
David Warner says Kane Williamson will play for SRH in next season too

ఐపీఎల్ క్రికెట్ లో మెరుగైన ఆటతీరు కనబరిచే జట్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఒకటి. ఎక్కువమంది స్టార్లు లేకపోయినా సమష్టితత్వానికి మారుపేరుగా నిలిచే హైదరాబాద్ జట్టు ఐపీఎల్ లో అనేక చిరస్మరణీయ విజయాలు అందుకుంది. సన్ రైజర్స్ విజయప్రస్థానంలో కివీస్ సారథి కేన్ విలియమ్సన్ భాగస్వామ్యం ఎనలేనిది. అయితే, ఇటీవల ముగిసిన సీజన్ లో పలు మ్యాచ్ లకు దూరంగా ఉన్న విలియమ్సన్ తాను బరిలో దిగిన కొన్ని మ్యాచ్ లలో ట్రేడ్ మార్క్ ఇన్నింగ్స్ లతో అలరించాడు.

అయితే, వచ్చే సీజన్ కు విలియమ్సన్ ను సన్ రైజర్స్ జట్టు నుంచి తీసేస్తున్నారని, ఈ కివీస్ ఆటగాడు మరో జట్టుకు ఆడతాడని ప్రచారం జరుగుతోంది. దాంతో సన్ రైజర్స్ అభిమానులు ఈ విషయాన్ని కెప్టెన్ డేవిడ్ వార్నర్ దృష్టికి తీసుకెళ్లారు. మీ తర్వాత అందరి ఆశలు విలియమ్సన్ పైనే ఉన్నాయి, అతడిని హైదరాబాద్ జట్టులోనే ఉంచాలని సూచించారు.  

దీనిపై వెంటనే స్పందించిన వార్నర్... విలియమ్సన్ ఎక్కడికీ వెళ్లడంలేదని, వచ్చే సీజన్ లోనూ సన్ రైజర్స్ కే ఆడతాడని స్పష్టం చేశాడు. విలియమ్సన్ ఎస్ఆర్ హెచ్ జట్టులో ఉండాలని తాను కూడా కోరుకుంటానని, అతడిని వదులుకునే ప్రసక్తేలేదని వెల్లడించాడు.