‘ఇప్పుడు గుర్తుకొచ్చామా?’ అంటూ జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌ను నిలదీసిన ప్రజలు

15-11-2020 Sun 10:27
  • త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు
  • ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి నాయకుల తిప్పలు
  • చెర్లపల్లి డివిజన్‌కు వెళ్లిన బొంతు రామ్మోహన్
  • ఇన్నాళ్లూ అభివృద్ధి పనులు ఎందుకు చేయలేదని నిలదీత
bitter experience to bontu

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు త్వరలోనే జరుగుతాయన్న సంకేతాలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి రాజకీయ నాయకులు పర్యటనలు జరుపుతున్నారు. అయితే, ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ఈ రోజు ఉదయం చెర్లపల్లి డివిజన్‌కు వెళ్లగా ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల కురిసిన వరదల ధాటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు వరద సాయం పంపిణీ చేయడానికి ఆయన అక్కడకు వెళ్లారు.

గత ఐదేళ్లుగా ఎన్నడూ తమ వద్దకు రాని మేయర్ ఇప్పుడు మాత్రం వచ్చారంటూ ఆయనను నిలదీశారు. తమ డివిజన్‌లో ఇన్నాళ్లూ అభివృద్ధి పనులు ఎందుకు చేయలేదని కాలనీ వాసులు ప్రశ్నించారు.  ఇంతవరకు తమకు కనీసం వరద సాయం కూడా  అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఇటీవల పలువురు టీఆర్ఎస్ నేతలకు కూడా ఇటువంటి అనుభవాలు ఎదురవుతున్న విషయం తెలిసిందే.