Narendra Modi: విస్తరణ వాదానికి వ్యతిరేకం... రెచ్చగొడితే దీటైన జవాబిస్తాం: చైనా టార్గెట్ గా నరేంద్ర మోదీ వ్యాఖ్యలు!

  • 18వ శతాబ్ధం నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి
  • దేశ ప్రయోజనాలను కాపాడుకోవడంలో వెనక్కు తగ్గబోము
  • జవాన్లను ఉద్దేశించి నరేంద్ర మోదీ
Modi Warns expansionist forces

ఇండియాకు ఇరుగు, పొరుగున ఉన్న దేశాల నుంచి ఏదైనా ముప్పు ఏర్పడితే దీటైన జవాబిచ్చేందుకు ఏ క్షణమైనా సిద్ధంగా ఉంటామని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. రాజస్థాన్ లోని లోంగీవాలాలో జవాన్లను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, చైనా పేరును ప్రస్తావించకుండా వ్యాఖ్యలు చేశారు. ప్రపంచమంతా ఇప్పుడు విస్తరణ వాదంలో ఉందని, 18వ శతాబ్దంలో ఉన్నటువంటి పరిస్థితులే ఇప్పుడూ కనిపిస్తున్నాయని, భారత్ మాత్రం విస్తరణ వాదానికి వ్యతిరేకమని అన్నారు.

"ఇండియా తన ప్రయోజనాలను కాపాడుకోవడంలో ఏ మాత్రమూ వెనక్కు తగ్గబోదని ఇప్పుడు ప్రపంచానికి తెలుసు. ఇండియాకు పొరుగునే ఉగ్రవాదానికి ఊతమిస్తున్న దేశం ఉంది. భారత జవాన్లు వారి దేశంలోకి చొచ్చుకెళ్లి లక్షిత దాడులు చేశారు. మనపై దాడులు చేస్తే, మనమేం చేయగలమన్న విషయం సర్జికల్ దాడుల తరువాత ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడు భారత సైన్యం పలు పెద్ద దేశాలతో కలిసి సైనిక విన్యాసాలు చేస్తోంది. ఉగ్రవాదంపై పోరులో పలు దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలను ఏర్పరచుకున్నాం. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న స్థావరాలపైనా దాడులు చేయగలమని నిరూపించాం" అని మోదీ వ్యాఖ్యానించారు.

More Telugu News