అందుబాటులోకి పీవీసీ ఆధార్ కార్డులు.. ఇంట్లోని అందరి కోసం ఒక్కరే దరఖాస్తు చేసుకునే అవకాశం!

15-11-2020 Sun 10:11
  • గత నెలలో అందుబాటులోకి వచ్చిన పీవీసీ ఆధార్ కార్డులు
  • 50 రూపాయల నామమాత్రపు ఫీజుతో పొందే అవకాశం
  • ఫోన్ నంబరు రిజిస్టర్ కాకున్నా దరఖాస్తు చేసుకోవచ్చు
One person can order Aadhaar PVC cards online for whole family

ఆధార్ ప్రాధికార సంస్థ యూఐడీఏఐ గత నెలలో పీవీసీ ఆధార్ కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది చూడ్డానికి క్రెడిట్, డెబిట్, పాన్‌కార్డులా ఉంటుంది. ఎంచక్కా వాలెట్‌లో పెట్టుకోవచ్చు. ఈ కొత్త పీవీసీ కార్డులో యూఐడీఏఐ బోల్డన్ని సెక్యూరిటీ ఫీచర్లు జోడించింది. అంతేకాదు, ఇది ఎంతోకాలం మన్నుతుంది కూడా. దేశంలోని ఎవరైనా కేవలం 50 రూపాయల నామమాత్రపు ఫీజు చెల్లించి వీటిని పొందవచ్చు. ఆధార్‌లో తమ ఫోన్ నంబరు లేనివారు నాన్-రిజిస్టర్డ్, లేదంటే ప్రత్యామ్నాయ ఫోన్ నంబరు ఆప్షన్‌పై క్లిక్ చేసి పీవీసీ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాదు, తన మొబైల్ నంబరు ఉపయోగించి ఇంటి సభ్యులందరి కోసం ఒక్కరే దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కూడా కల్పించింది. ఈ మేరకు ఆధార్ ప్రాధికార సంస్థ ట్వీట్ చేసింది.

పీవీసీ ఆధార్ కార్డు కోసం ఇలా దరఖాస్తు చేసుకోవాలి

* తొలుత https://residentpvc.uidai.gov.in/order-pvcreprint లోకి వెళ్లాలి
* ఆధార్ నంబరు/వర్చువల్ ఐడెంటిఫికేషన్ నంబర్, లేదంటే ఆధార్ కార్డుపై ఉన్న ఈఐడీ నంబరు ఎంటర్ చేయాలి
* ఆ తర్వాత ‘సెండ్ ఓటీపీ’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. మొబైల్ నంబరు రిజిస్టర్ చేసుకోకుంటే ప్రత్యామ్నాయ మొబైల్ నంబరు ఇవ్వొచ్చు.
* మొబైల్ నంబరు రిజిస్టర్ అయి ఉంటే మాత్రం ఆధార్ ప్రివ్యూ కనిపిస్తుంది. లేని వారికి కార్డు ప్రివ్యూ కనిపించదు.
* మొబైల్ ఆధార్ అప్లికేషన్ కోసం టైమ్ బేస్‌డ్ టైమ్ పాస్‌వర్డ్ (టీఓటీపీ)ని కూడా ఉపయోగించుకోవచ్చు.
* ఓటీపీని ఎంటర్ చేశాక, పీవీసీ కార్డు కోసం అవసరమైన రుసుము చెల్లిస్తే పీవీసీ కార్డు కోసం దరఖాస్తు పూర్తయినట్టే.