అల్ ఖైదా కీలక నేతను హతమార్చిన ఇజ్రాయిల్ సైన్యం!

15-11-2020 Sun 09:59
  • అల్ ఖైదాలో సెకండ్ ఇన్ కమాండ్ గా ఉన్న అబ్దుల్లా అహ్మద్
  • గత ఆగస్టులోనే హతం
  • ఇప్పుడు బయటపడిందని 'న్యూయార్క్ టైమ్స్' కథనం

అల్ ఖైదాకు చెందిన మరో కీలక నేత హతమయ్యాడు. అల్ ఖైదాలో సెకండ్ ఇన్ కమాండ్ గా ఉంటూ, 1998లో ఆఫ్రికాలోని రెండు యూఎస్ ఎంబసీలపై బాంబు దాడులకు పాల్పడటం వంటి ఆరోపణలున్న అబ్దుల్లా అహ్మద్ అబ్దుల్లా అలియాస్ అబూ ముహమ్మద్ - మస్రీని ఇజ్రాయిల్ దళాలు హతమార్చాయని ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందిందని 'న్యూయార్క్ టైమ్స్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

అల్ ఖైదా ప్రస్తుత నేత అయ్ మాన్ అల్ జవహరీ తరువాత ఆ బాధ్యతలను స్వీకరిస్తాడని భావిస్తున్న అబూ ముహమ్మద్ ను, టెహ్రాన్ వీధుల్లో ఆగస్టు 7న మోటార్ సైకిల్ పై వెళ్లిన జవాన్లు హతమార్చారని, ఈ విషయాన్ని ఇంతకాలమూ రహస్యంగా ఉంచారని పత్రిక పేర్కొంది. కాగా, మిస్త్రీ మరణించాడని గత అక్టోబర్ లో ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన సెక్యూరిటీ వర్గాలు వెల్లడించినా, అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.

ఇక, మస్రీని టార్గెట్ చేయడం వెనుక అమెరికా ప్రమేయం ఏమైనా ఉందా అన్న విషయమై స్పష్టత రాలేదు. అయితే, ఇరాన్ లో అల్ ఖైదా కీలక నేతగా అతను ఎదిగిన తరువాత, అమెరికా అతని కదలికలను అనుక్షణం గమనించేలా నిఘా పెట్టింది. ఇక మస్రీ మరణాన్ని అల్ ఖైదా ఇంకా ఖరారు చేయలేదు.

ఈ వార్త బయటకు వచ్చిన తరువాత, ఇరాన్ స్పందిస్తూ, తమ దేశంలో అల్ ఖైదాకు చెందిన ఒక్క టెర్రరిస్టు కూడా లేడని ప్రకటించింది. యూఎస్ తో పాటు ఇజ్రాయిల్ కొన్నిసార్లు ఇరాన్ ను ఉగ్రవాదులున్న దేశంగా నిరూపించేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయని విదేశాంగ శాఖ ప్రతినిధి సయీద్ ఖటిబాడ్జెహ్ వ్యాఖ్యానించారు.