నితీశ్ కుమార్ ప్రభుత్వం ఎంతోకాలం ఉండదు: ఆర్జేడీ నేత మనోజ్ ఝా

15-11-2020 Sun 09:42
  • 40 సీట్లు గెలుచుకున్న వ్యక్తి సీఎం కావాలనుకుంటున్నారు
  • త్వరలోనే ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వస్తారు
  • బీహార్ ప్రజలు ఇప్పుడు మేల్కొన్నారు
Nitish Kumar wont last long as CM says Manoj Jha

బీహార్ ముఖ్యమంత్రిగా మరోమారు ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్న నితీశ్ కుమార్‌పై రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత మనోజ్ కుమార్ ఝా సంచలన వ్యాఖ్యలు చేశారు. నితీశ్ ప్రభుత్వం ఎంతోకాలం మనలేదని తేల్చి చెప్పారు. మహాఘట్‌బంధన్’నుంచి నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్ (ఎన్డీయే)లోకి మారడం ద్వారా 2017లో ప్రజలు ఇచ్చిన తీర్పును నితీశ్ కాలరాశారని మనోజ్ కుమార్ మండిపడ్డారు. బీహార్ ప్రజలు ఇప్పుడు మేల్కొన్నారని అన్నారు. తాజా ఎన్నికల్లో నితీశ్ 40 సీట్లు కూడా గెలుచుకోలేకపోయారని, స్వల్ప మెజారిటీతో గద్దెనెక్కే ప్రభుత్వం పూర్తికాలం మనలేదని పేర్కొన్నారు. 

ఆర్జేడీపై గెలిచిన అభ్యర్థులకు అతి తక్కువ మెజారిటీ ఓట్లు రావడంపై తాము ఇప్పటికే ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్టు ఝా చెప్పారు. ‘‘ప్రజలు మిమ్మల్ని వదిలిపెట్టరు. జవాబుదారీతనం కోరుతూ రాబోయే రోజుల్లో  వీధుల్లోకి వస్తారు’’ అని నితీశ్‌ను హెచ్చరించారు. 

కాగా, శుక్రవారం గవర్నర్‌ ఫగు చౌహాన్‌ను కలిసిన నితీశ్ తన రాజీనామాను సమర్పించారు. మరోమారు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. 40 సీట్లు గెలుచుకున్న వ్యక్తి సీఎం కావాలనుకుంటున్నారని ఎద్దేవా చేసిన ఝా.. నియంత్రణ, స్క్రిప్ట్ అంతా బీజేపీదేనని అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ 74  స్థానాలు గెలుచుకోగా, జేడీయూ 43 స్థానాల్లో విజయం సాధించింది.