సచిన్‌ షేక్‌హ్యాండ్ ఇచ్చాక స్నానం చేయకూడదనుకున్నా: యువరాజ్

15-11-2020 Sun 08:22
  • 2000వ సంవత్సరంలో భారత జట్టులో యువీ ఎంపిక
  • టీం బస్సులో జరిగిన ఘటనను గుర్తు చేసుకున్న యువరాజ్
  • ‘స్టోరీస్ బిహైండ్ ద స్టోరీ’ పేరుతో నెట్‌ఫ్లిక్స్‌లో వీడియో అప్‌లోడ్
I didnot want to take shower because i shook hands with sachin

ప్రపంచ ప్రఖ్యాత ఆటగాడు సచిన్ టెండూల్కర్ తనకు తొలిసారి షేక్‌హ్యాండ్ ఇచ్చిన తర్వాత తాను స్నానం చేయాలని అనుకోలేదని మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ గుర్తు చేసుకున్నాడు. ‘స్టోరీస్ బిహైండ్ ద స్టోరీ’ పేరుతో నెట్‌ఫ్లిక్స్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలో యువీ తాను భారత జట్టుకు తొలిసారి ఆడిన క్షణాలను గుర్తు చేసుకున్నాడు. అండర్-19 ప్రపంచకప్‌లో దుమ్మురేపిన యువరాజ్ సింగ్‌కు 2000వ సంవత్సరంలో భారత జట్టులో చోటు లభించింది.

అప్పటి వరకు అండర్-19 జట్టుకు  ఆడిన తాను టెండూల్కర్, గంగూలీ, ద్రవిడ్, అనిల్ కుంబ్లే, శ్రీనాథ్ వంటి తన హీరోలతో కలిసి ఆడే అవకాశం లభించడంతో ఉప్పొంగిపోయానని యువరాజ్ పేర్కొన్నాడు. చదువుకునేటప్పుడు తానెప్పుడూ బ్యాక్ బెంచర్‌నేనని, టీమిండియా బస్సులోనూ తాను బ్యాంక్‌బెంచర్‌నేనని గుర్తు చేసుకున్నాడు. తనతోపాటు జట్టుకు ఎంపికైన జహీర్‌ఖాన్, విజయ్ దహియాలతో కలిసి బస్సులో వెనక కూర్చున్నానని, అప్పుడు సచిన్ వచ్చి మా అందరితో కరచాలనం చేశాడని యువీ పేర్కొన్నాడు.

నాటి ఘటన తనకింకా గుర్తుందని, సచిన్ వెళ్లి సీటులో కూర్చున్న తర్వాత అతడితో షేక్‌హ్యాండ్ తీసుకున్న చేతితో తన ఒళ్లంతా రుద్దుకున్నానని చెప్పాడు. టెండూల్కర్‌తో కరచాలనం చేశాను కాబట్టి ఆ రోజు స్నానం చేయాలని అనుకోలేదని చెబుతూ నాటి ఘటనను నెమరువేసుకున్నాడు. సచిన్‌ను భారత క్రికెట్‌లో మైఖేల్ జోర్డాన్‌గా అభివర్ణించిన యువరాజ్.. భారత అభిమానుల ఆశలను సచిన్ కొన్నేళ్లపాటు మోశాడని ప్రశంసించాడు.