'లేడీస్ టైలర్' అర్చన ఇప్పుడెలా ఉందో చూడండి!

14-11-2020 Sat 22:08
  • 80,90వ దశకాల్లో ప్రతిభావనిగా గుర్తింపు తెచ్చుకున్న అర్చన
  • నీరీక్షణ, దాసి చిత్రాల్లో ఉత్తమ నటన
  • తాజాగా అలీతో సరదాగా కార్యక్రమంలో కనిపించిన అర్చన
Old heroine Archana appears in a interview

తెలుగు, తమిళం చిత్ర పరిశ్రమల్లో ఎంతో ప్రతిభావంతురాలైన నటిగా గుర్తింపు పొందిన అర్చన దాదాపు పాతికేళ్ల తర్వాత ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. అలీ హోస్ట్ గా వ్యవహరించే అలీతో సరదాగా కార్యక్రమంలో అర్చన సందడి చేశారు.

80, 90వ దశకాల్లో తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో గిలిగింతలు పెట్టిన అర్చన ఇన్నాళ్లకు మళ్లీ తన అభిమానులకు దర్శనమిచ్చారు. లేడీస్ టైలర్ లో సుజాత టీచర్ పాత్రలో అర్చన నటన అభిమానుల మనోఫలకంపై చెదిరిపోనిది. నిరీక్షణ, దాసి వంటి చిత్రాలు అర్చన నటనా ప్రతిభకు తార్కాణాలు. ఈ జాతీయ ఉత్తమ నటి అవార్డు గ్రహీత తాజాగా అలీతో సరదాగా కార్యక్రమంలో అనేక సంగతులు ప్రస్తావించారు.

తాను నల్లగా ఉన్నానని ఎప్పుడూ పట్టించుకోలేదని, ప్రతిభ ముఖ్యమని చెప్పారు. నల్లగా ఉండి, టాలెంట్ ఉన్న హీరోయిన్లను బాగా చూపించేందుకు కెమెరామన్లు ఎంతో ఉత్సాహం చూపిస్తారని వివరించారు. తన దృష్టిలో కామెడీ చేయడం చాలా కష్టమని పేర్కొన్నారు.

ఇక, తన తొలిచిత్రం హీరో భానుచందర్ ను అన్నయ్య అని సంబోధించారు. సెట్స్ పై భానుచందర్ తో ఎప్పుడూ గొడవలేనని చెప్పారు. కాగా, పాతికేళ్ల తర్వాత అర్చన ఓ తెలుగు చిత్రంలో నటించేందుకు అంగీకరించారు. ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన మాటల ప్రకారం ఓ భారీ చిత్రం అని అర్థమవుతోంది.