సీఎం జగన్ చుట్టూ ఓ కోటరీ ఉంది... వారి మాటలు వినొద్దు: శివస్వామి

14-11-2020 Sat 21:19
  • ఏపీలో పరిస్థితులపై శివస్వామి అసంతృప్తి
  • హిందువుల్లో అసహనం పెరిగిపోతోందని వ్యాఖ్యలు
  • ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వీడాలన్న శైవక్షేత్ర పీఠాధిపతి
Siva Swamy responds on recent issues in AP

శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి ఏపీలో పరిస్థితులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీరు పట్ల హిందువుల్లో అసహనం పెరిగిపోతోందని, ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్లే హిందూ ధర్మంపై దాడులు నిత్యకృత్యం అయ్యాయని ఆరోపించారు. హిందూ ధర్మంపై దాడుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, తగిన చర్యలు తీసుకోవాలని శివస్వామి డిమాండ్ చేశారు.

ఏపీ సీఎం జగన్ చుట్టూ ఓ కోటరీ ఉందని, సీఎం వారి మాటలు వినొద్దని హితవు పలికారు. ఎక్కడో ఉండి ప్రకటనలు చేయకుండా ప్రజల మధ్యకు రావాలని స్పష్టం చేశారు. ఏపీలో మాతమార్పిళ్ల వల్లే కులాల మధ్య చిచ్చు రేగుతోందని, ఈ విషయాన్ని సీఎం జగన్ తీవ్రంగా పరిగణించాలని అన్నారు. పాత దేవాలయాలకు అడ్డంకులు సృష్టిస్తున్నారని, ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో కొనసాగితే మాత్రం ఓట్లు అడగడానికి వచ్చే ఎంపీలు, ఎమ్మెల్యేలను తరిమికొడతామని శివస్వామి హెచ్చరించారు.