Kishan Reddy: ఈ విషయమై సీఎం జగన్ కు ఇప్పటికే లేఖ రాశాను: కిషన్ రెడ్డి

  • ఎర్రచందనం పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
  • టాస్క్ ఫోర్స్ ను బలోపేతం చేయాలి
  • రాష్ట్రానికి సహకరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది
I wrote a letter to Jagan on Red Sandal says Kishan Reddy

శేషాచలం అడవుల్లో ఉన్న అత్యంత విలువైన ఎర్రచందనం తరలిపోతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఎర్రచందనం వృక్షాల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈరోజు తిరుమల శ్రీవారిని కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయం వద్ద ఆయనకు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి స్వాగతం పలికారు.

దర్శనానంతరం తిరుమలలోని పద్మావతి అతిథిగృహం ప్రాంగణంలో కిషన్ రెడ్డి ఎర్రచందనం మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎర్రచందనం పరిరక్షణ కోసం తాను ఉద్యమం చేశానని చెప్పారు. ఎర్రచందనం పరిరక్షణ కోసం టాస్క్ ఫోర్స్ ను బలోపేతం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఈ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్ కు తాను ఇప్పటికే లేఖ రాశానని చెప్పారు.

ఎర్రచందనాన్ని జాతీయ సంపదగా గుర్తించి... దాని పరిరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. కరోనా నుంచి మానవాళికి ముక్తిని ప్రసాదించాలని స్వామివారిని కోరుకున్నానని చెప్పారు. సరిహద్దుల్లో పాక్ సైన్యం కవ్వింపు చర్యలను మన సైన్యం గట్టిగా తిప్పికొట్టిందని కిషన్ రెడ్డి అన్నారు.

More Telugu News