Telangana: కలెక్టర్లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు.. సిద్దిపేటకు మళ్లీ వెంకటరామిరెడ్డే!

  • దుబ్బాక ఉప ఎన్నిక ముందు సంగారెడ్డికి బదిలీ అయిన వెంకటరామిరెడ్డి
  • పలువురు కలెక్టర్లకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి
  • మళ్లీ మంచిర్యాలకు వెళ్లిన భారతి హొళికెరి
Venkata Rami Reddy Re Appoints As Siddipet Collector

దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా గత నెలలో సిద్దిపేట నుంచి సంగారెడ్డి జిల్లాకు బదిలీ అయిన కలెక్టర్ వెంకటరామిరెడ్డిని మళ్లీ సిద్దిపేట కలెక్టర్‌గా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసిన ప్రభుత్వం ఉప ఎన్నిక పూర్తయిన నేపథ్యంలో సిద్దిపేట బాధ్యతను మళ్లీ వెంకటరామిరెడ్డికే అప్పగించింది. అలాగే, మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ బాధ్యతలు కూడా అప్పగించింది. దుబ్బాక ఉప ఎన్నికకు ముందు మెదక్ జిల్లా కలెక్టర్‌గా నియమితులైన సంగారెడ్డి కలెక్టర్ ఎం.హన్మంతరావును తిరిగి సంగారెడ్డికి బదిలీ చేసింది.

ఇప్పటి వరకు సిద్దిపేట కలెక్టర్‌గా ఉన్న మంచిర్యాల కలెక్టర్ భారతి హొళికెరిని మళ్లీ మంచిర్యాలకు పంపించింది. ఆ జిల్లా  కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సిక్తా పట్నాయక్‌ను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేసింది. పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న శశాంకకు ఆ బాధ్యతల నుంచి విముక్తి కల్పిస్తూ ఆ స్థానంలో హొళికెరికి అదనపు బాధ్యతలు అప్పగించింది. మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ వి.వెంకటేశ్వర్లు బదిలీ కాగా, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతికి మల్కాజిగిరి జిల్లా అదనపు బాధ్యతలు అప్పగించారు.

More Telugu News