'థియేటర్లోనే కలుద్దాం..' అంటున్న హీరో సాయితేజ్!

13-11-2020 Fri 21:09
  • సాయితేజ్ తాజా చిత్రం 'సోలో బ్రతుకే సో బెటర్'
  • సుబ్బు దర్శకత్వం.. నభానటేష్ కథానాయిక   
  • ఓటీటీలో రిలీజ్ అవుతుందంటూ ప్రచారం  
  • డిసెంబర్లో థియేటర్లలోనే రిలీజ్ అంటూ క్లారిటీ
Saitej latest film to be released in theaters
తాను కచ్చితంగా థియేటర్లకే వస్తున్నానంటూ మెగా ఫ్యామిలీ హీరో సాయితేజ్ తన సినిమా విషయంలో క్లారిటీ ఇచ్చేశాడు. తన తాజా చిత్రం 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా విషయంలో సాయితేజ్ ఆ విధంగా చెప్పి, అభిమానుల్లో వున్న డౌట్స్ ని తీర్చేశాడు. సుబ్బు దర్శకత్వంలో సాయితేజ్, నభా నటేష్ హీరో హీరోయిన్లుగా   ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ సినిమా ఇప్పటికే పూర్తయి, విడుదలకు రెడీ అయినప్పటికీ, లాక్ డౌన్ వల్ల విడుదలలో ఆలస్యం జరిగింది. దీంతో ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తారంటూ ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. దానికి తగ్గట్టుగా కొందరు ఓటీటీ ప్లేయర్స్ నిర్మాతను సంప్రదించినట్టు కూడా తెలిసింది. అయితే, చిత్రాన్ని థియేటర్లలోనే రిలీజ్ చేయాలని గట్టిగా నిర్ణయించుకోవడం వల్ల ఓటీటీకి ఇవ్వలేదు.

ఇక ఇప్పుడు థియేటర్లు తెరచుకోవచ్చని ప్రభుత్వం నిబంధనలతో కూడిన అనుమతులు ఇవ్వడంతో వచ్చే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఈ రోజు హీరో సాయితేజ్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు. 'డిసెంబర్లో మీకు, నాకు ఇష్టమైన థియేటర్లో కలుద్దాం..' అంటూ అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు కూడా చెప్పాడు. అలాగే చిత్రంలోని ఓ ఫొటోను కూడా పోస్ట్ చేశాడు.