Australia: ఈసారి జరుపుకుంటోన్న దీపావళికి ప్రత్యేకత ఉంది: ఆస్ట్రేలియా ప్రధాని

  • చీకటిని పారద్రోలే దీపావళి శుభాకాంక్షలు
  • అనుభవపూర్వకంగా దీపావళిని జరుపుకుంటున్నాం
  • ప్రతి దేశం కరోనా వైరస్ ప్రభావానికి గురైంది
  • అనేక మంది ప్రాణాలు కోల్పోయారు
australia pm diwali wishes

ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా నేపథ్యంలో ఈ పండుగ మరింత ప్రత్యేకమైందని చెప్పారు. చీకటిని పారద్రోలే దీపావళి గురించి ఎన్నో ఏళ్లుగా గుర్తుచేసుకుంటున్నామని ఆయన చెప్పారు. అయితే, అనుభవపూర్వకంగా మాత్రం ఎన్నడూ తెలుసుకోలేదని అన్నారు.

ఈసారి జరుపుకుంటోన్న దీపావళికి ప్రత్యేకత ఉందని, ప్రతి దేశం కరోనా వైరస్ ప్రభావానికి గురైందని గుర్తు చేశారు. ఈ వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన అన్నారు. దీని వల్ల చాలా మంది జీవనోపాధిని కోల్పోయారని, ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారని చెప్పారు.

అయినప్పటికీ, ఇంతటి సంక్షోభ పరిస్థితుల్లో ఒకరికొకరం అండగా నిలిచామని పేర్కొన్నారు. కరోనా వైరస్‌పై జరుగుతున్న పోరాటంలో ముందున్న సిబ్బంది నుంచి స్ఫూర్తి పొందామని తెలిపారు. ఈ ఏడాది పూర్తిగా చీకటిని చూశామని, ప్రస్తుతం వెలుతురు చీకటిని క్రమంగా కమ్మేస్తోందని చెప్పారు.

సమీప భవిష్యత్తులో మరింత ప్రకాశవంతమైన రోజులున్నాయని ఆయన చెప్పారు. ఈ మేరకు వీడియో రూపంలో ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఆస్ట్రేలియాలో 70 లక్షల మంది వరకు భారత సంతతి ప్రజలు నివసిస్తున్నారు. భారతీయులు అక్కడ దీపావళిని ఘనంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఆయన దీపావళి సందర్భంగా ప్రత్యేకంగా సందేశాన్ని ఇచ్చారు. ఆస్ట్రేలియా-భారత్ మధ్య ఇటీవలి కాలంలో సత్సంబంధాలు మరింత బలపడ్డాయి. చైనా చర్యలను ఇరు దేశాలు ఖండిస్తున్నాయి.

More Telugu News