Brahmos: 'బ్రహ్మోస్'ను విక్రయించనున్న భారత్... తొలి కస్టమర్ ఫిలిప్పీన్స్!

  • ఇండియా, రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్
  • వచ్చే సంవత్సరంలో మోదీ, రోడ్రిగో సమావేశం
  • పలు కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం
India to Sell Brahmos to Philippines

ఇండియా, రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన అత్యాధునిక సూపర్ సోనిక్ మిసైల్ బ్రహ్మోస్ లను విక్రయించాలని ఇండియా భావిస్తోంది. వచ్చే సంవత్సరం ప్రధాని నరేంద్ర మోదీతో, ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్ రోడ్రిగో డూరెట్టి సమావేశం కానుండగా, ఇదే సమావేశంలో బ్రహ్మోస్ క్షిపణుల తొలి కస్టమర్ గా ఫిలిప్పీన్స్ సంతకాలు చేయనుందని తెలుస్తోంది.

కాగా, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ - రష్యా జాయింట్ వెంచర్ బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఈ ఆయుధ వ్యవస్థను తయారు చేసిన సంగతి తెలిసిందే. ఈ టీమ్ డిసెంబర్ లో మనీలాలో పర్యటించి, ఇరు దేశాల మధ్యా కుదరాల్సిన డీల్ పై తుది రిపోర్టును సమర్పించనుంది. ఫిలిప్పీన్స్ ఆర్మీకి భూ ఉపరితలంపై నుంచి ప్రయోగించగల బ్రహ్మోస్ క్షిపణులను విక్రయించాలన్నది భారత అభిమతమని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఓ అధికారి వెల్లడించారు.

ఈ డీల్ కు తుది రూపును తీసుకుని వచ్చే ముందు కొన్ని చిన్న చిన్న అంశాలను పరిష్కరించాల్సివుందని వ్యాఖ్యానించిన ఉన్నతాధికారులు, ఇరు దేశాధినేతల సమావేశానికి ముందుగానే ఇవి ఓ కొలిక్కి వస్తాయని తెలిపారు. కాగా, ఈ సమావేశం తేదీలు ఇంకా ఖరారు కావాల్సి వుంది.

ఇక ఈ సమావేశంలో బ్రహ్మోస్ క్షిపణుల విక్రయంతో పాటు మరిన్ని ఒప్పందాలు కూడా ఇరు దేశాల మధ్యా కుదరనున్నాయి. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ తో డ్రగ్స్ డీల్, విమానయాన రంగం, టూరిజం తదితరాల విషయంలోనూ ఒప్పందాలు కుదరనున్నాయని తెలుస్తోంది.

More Telugu News