Nitish Kumar: సోమవారం నాడు నితీశ్ ప్రమాణ స్వీకారం?

Nitish Swearing Ceremony on Monday says Party Sources
  • బిహార్‌ సీఎంగా వరుసగా నాలుగో సారి 
  • ‘భయ్యూ దూజ్‌’ పండుగ రోజున పదవీ ప్రమాణం
  • వెల్లడించిన పార్టీ వర్గాలు
బిహార్‌ ముఖ్యమంత్రిగా వరుసగా నాలుగో సారి జేడీ (యూ) అధినేత నితీశ్‌ కుమార్ సోమవారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. బిహార్ వాసులు ఎంతో పవిత్రంగా జరుపుకునే ‘భయ్యూ దూజ్‌’ పండుగ రోజున ఆయన సీఎంగా పదవిని మరోసారి చేపడతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

2015 ఎన్నికల్లో 71 సీట్లను సాధించిన నితీశ్ కుమార్, ఈ దఫా 28 సీట్లను కోల్పోయారు. రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నితీశ్ కు, ఈ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ రూపంలో అవాంతరం ఎదురైంది. చిరాగ్ నిలిపిన అభ్యర్థులు, ఎన్డీయేలో భాగస్వామ్యమైన జేడీ (యూ) అభ్యర్థుల ఓట్లను చీల్చారు. ఇదే విషయాన్ని మనసులో పెట్టుకున్న నితీశ్, ఎల్జేపీని తక్షణం ఎన్డీయే నుంచి సాగనంపాలని కోరుతున్నారు.

ఇక, గతేడాది జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో శివసేనతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన బీజేపీ, విజయం తరువాత, సీఎంగా తమ అభ్యర్థే ఉండాలని పట్టుబట్టడంతో శివసేన విడిపోయి, కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బిహార్ లో నితీశ్ ను కాదని తమ అభ్యర్థిని సీఎం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తే, మహారాష్ట్రలో నెలకొన్న పరిణామాలే ఏర్పడవచ్చని, తన పాత మిత్రుడు ఆర్జేడీతో నితీశ్ చేతులు కలపవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Nitish Kumar
BJP
Chirag Paswan
Bihar
CM

More Telugu News