Twitter: ట్విట్టర్ మెడపై వేలాడుతున్న కత్తి.. ప్రభుత్వ నోటీసులకు స్పందించకుంటే వేటు!

  • లేహ్‌ను జమ్మూకశ్మీర్‌లో భాగంగా చూపించిన ట్విట్టర్
  • అంతకుముందు చైనాలో భాగంగా చూపించిన వైనం
  • తీవ్రంగా పరిగణించిన కేంద్రం
Twitter faces block out in India over leh row

కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్ రాజధాని లేహ్‌ను జమ్మూకశ్మీర్‌లో అంతర్భాగంగా చూపించిన మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌పై కేంద్రం ఆగ్రహంగా ఉంది. అలా ఎందుకు చూపించాల్సి వచ్చిందో ఐదు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

ప్రభుత్వ ఆదేశాలకు ట్విట్టర్ స్పందించకున్నా, అది ఇచ్చే వివరణ సంతృప్తికరంగా లేకున్నా కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద ట్విట్టర్ కార్యకలాపాలను నిలిపివేయడం, లేదంటే కనీసం ఆరు నెలల జైలు శిక్ష పడేలా పోలీసు కేసు నమోదు చేయడంలో ఏదో ఒకటి జరిగే అవకాశం ఉంది.

ఆమధ్య లడఖ్‌ను ప్రభుత్వం కేంద్రపాలిత ప్రాంతంగా చేసి, దానికి లేహ్‌ను రాజధానిగా చేసింది. అయితే, ట్విట్టర్ మాత్రం ఇటీవల లేహ్‌ను చైనాలో భాగంగా చూపించింది. దీనిని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం ట్విట్టర్ అధినేత జాక్ డోర్సీకి లేఖ రాయడంతో పటంలో మార్పులు చేసింది. అయితే, ఈసారి జమ్మూకశ్మీర్‌లో భాగంగా ఉంచేసింది. దీంతో ప్రభుత్వం మరోమారు మండిపడింది. ఇలా ఎందుకు చూపించాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలంటూ నోటీసులు పంపింది.

భారత సార్వభౌమత్వాన్ని అణగదొక్కేందుకు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నట్టు కనిపిస్తోందని నోటీసుల్లో ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుడు పటాన్ని చూపించి భారతదేశ ప్రాదేశిక సమగ్రతను అగౌరవపరిచినందుకు వెబ్‌సైట్, దాని ప్రతినిధులపై చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో ఐదు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలను ట్విట్టర్ పెడచెవిన పెట్టినా, వివరణ సంతృప్తికరంగా లేకున్నా ట్విట్టర్‌పై వేటుతప్పదన్నమాటే!

More Telugu News