Jill Biden: అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ గురించి ఆసక్తికర సంగతులు ఇవిగో!

  • అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్
  • ప్రథమ మహిళగా జిల్ బైడెన్
  • ఐదు సార్లు ప్రపోజ్ చేసిన తర్వాత బైడెన్ కు ఓకే చెప్పిన జిల్
Interesting facts of Jill Biden

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ముగియడంతో పరిస్థితులు మారిపోయాయి. కొత్త అధ్యక్షుడిగా  జో బైడెన్ ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో బైడెన్ అర్ధాంగి జిల్ గురించి కొన్ని ఆసక్తికర అంశాలు మీడియాలో దర్శనమిస్తున్నాయి. జిల్ పూర్తి పేరు జిల్ జాకబ్స్. అమెరికాలోని న్యూజెర్సీలో 1951లో జన్మించారు. ఐదుగురు సంతానంలో తనే పెద్దది. అందరూ అమ్మాయిలే కావడంతో ఇంట్లో వాతావరణం ప్రత్యేకంగా ఉండేది.

జిల్ కుటుంబం అప్పట్లో ఫిలడెల్ఫియా శివారు ప్రాంతంలోని విల్లోగ్రోవ్ లో నివసించేది. జిల్ కు మొదట బిల్ స్టీవెన్ సన్ తో పెళ్లయింది. బిల్ ఆమె చదివిన కాలేజీలో ఫుట్ బాల్ ఆటగాడు. కొంతకాలానికి వీరు విడిపోయారు.

ఇక జో బైడెన్ జీవితంలో ఓ విషాదం ఉంది. 1972లో జరిగిన కారు ప్రమాదంలో ఆయన తన భార్యను, ఏడాది కుమార్తెను కోల్పోయారు. కొడుకులు బ్యూ, హంటర్ మాత్రం మిగిలారు. ఆ దశలోనే జిల్ పరిచయం అయ్యారు. అప్పుడు జో బైడెన్ సెనేటర్ కాగా, జిల్ ఇంకా విద్యార్థినే.

జిల్ అంటే ఎంతో మక్కువ చూపే జో బైడెన్ కు ఆమె ప్రేమ అంత సులభంగా లభించలేదు. ఐదు సార్లు ప్రపోజ్ చేసిన పిమ్మట ఆమె ఓకే చెప్పడంతో ఇద్దరూ పెళ్లి చేసుకుని నూతన జీవితం ఆరంభించారు. ఇద్దరి మధ్య 9 ఏళ్ల వయోభేదం ఉంది. కాగా, జిల్ తమ ప్రేమ గురించి చెబుతూ, తొలి పరిచయం తర్వాత లక్ష ఏళ్లయినా బైడెన్ తో తాను సర్దుకుపోవడం కష్టమేనని భావించానని ఓ ఇంటర్వ్యూలో చమత్కరించారు.

ప్రతి పురుషుడి విజయం వెనుక ఓ స్త్రీమూర్తి ఉంటుందన్న నేపథ్యంలో ఇవాళ జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవడం వెనుక జిల్ ప్రోత్సాహం, మద్దతు పుష్కలంగా ఉన్నాయనడంలో సందేహంలేదు.

More Telugu News