Chandrababu: వీడియో విడుదల చేసేంత వరకు వాస్తవం వెలుగులోకి రాలేదు: చంద్రబాబు

  • వేధింపులకు గురి చేసి సలాం కుటుంబాన్ని బలి తీసుకున్నారు
  • ప్రభుత్వ అసమర్థతకు కుటుంబాలు బలైపోతున్నాయి
  • రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోంది
Police not responded properly in Abdul Salam case says Chandrababu

నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ ఈ దారుణ ఘటనను చూసిన తర్వాత అసలు రాష్ట్రంలో ఎవరికైనా భద్రత ఉందా? అనే అనుమానం కలుగుతోందని చెప్పారు. సలాం కుటుంబాన్ని వేధింపులకు గురిచేసి... కుటుంబం మొత్తాన్ని బలి తీసుకున్నారని అన్నారు. ఆత్మహత్య ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారని... స్థానిక పోలీసులు మాత్రం కేసు నమోదు చేయలేదని మండిపడ్డారు.

సలాం కుటుంబసభ్యులు వీడియో విడుదల చేసేంత వరకు వాస్తవాలు వెలుగులోకి రాలేదని అన్నారు. వీడియో విడుదలయిన తర్వాత కూడా పోలీసులు సరిగా స్పందించలేదని చెప్పారు. దీనిపై ట్వీట్ చేసిన తర్వాతే స్పందించారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వల్ల ఎన్నో కుటుంబాలు బలైపోతున్నాయని చెప్పారు. బెయిల్ వచ్చే విధంగా పోలీసులు కేసు నమోదు చేశారని విమర్శించారు. టీడీపీ లాయర్ వల్లే నిందితులకు బెయిల్ వచ్చిందంటూ వైసీపీ కొత్త నాటకానికి తెరలేపిందని దుయ్యబట్టారు. కేసులు సరిగా నమోదు చేసి ఉంటే ఇద్దరు ఐపీఎస్ అధికారులను విచారణకు పంపాల్సిన అవసరం ఉండేది కాదని అన్నారు.

టీడీపీ హయాంలో రౌడీయిజం, ఫ్యాక్షనిజం, మత విద్వేషాలు లేకుండా చేశామని చంద్రబాబు చెప్పారు. ఏడాదిన్నరగా రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనించాలని, అబ్దుల్ సలాం కుటుంబానికి మద్దతుగా నిలవాలని చెప్పారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని... లేకపోతే ఈరోజు సలాం కుటుంబానికి జరిగిన అన్యాయం రేపు మరో కుటుంబానికి జరుగుతుందని అన్నారు.

More Telugu News