TS High Court: దీపావళికి బాణసంచా అమ్మడం, కొనడం చేయొద్దు: తెలంగాణ హైకోర్టు ఆదేశాలు

  • పొగవల్ల శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తుతాయంటూ పిల్
  • కరోనా నేపథ్యంలో నిషేధం విధించాలని విన్నపం
  • బాణసంచా షాపులను బంద్ చేయాలని ఆదేశించిన హైకోర్టు
TS HC bans crackers amid Corona

ఈ ఏడాది దీపావళి బాణసంచా పేలుళ్లు లేకుండానే జరిగిపోనుంది. బాణసంచా అమ్మకాలు, కొనుగోళ్లపై తెలంగాణ హైకోర్టు నిషేధం విధించింది. దీపావళి సందర్భంగా టపాకాయలు కాల్చకుండా ఆదేశాలను జారీ చేయాలని హైకోర్టులో పిల్ దాఖలైంది. లాయర్ ఇంద్రప్రకాశ్ ఈ పిల్ వేశారు. బాణసంచా కాల్చడం వల్ల వచ్చే పొగతో ప్రజలు శ్వాసకోశ ఇబ్బందులతో సతమతమవుతారని... కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న తరుణంలో బాణసంచాపై నిషేధం విధించాలని పిటిషన్ లో కోరారు.

ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. బాణసంచా షాపులను మూసేయాలని ఆదేశించింది. క్రాకర్స్ ను అమ్మడం కానీ, కొనడం కానీ చేయొద్దని తెలిపింది. తమ ఆదేశాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఈనెల 19న వివరాలను ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

 టపాకాయలు కాల్చకుండా ప్రజల్లో చైతన్యం కల్పించాలని పేర్కొంది. బాణసంచా కాల్చకుండా ఇప్పటికే రాజస్థాన్ హైకోర్టు ఆదేశించిందని తెలిపింది. కోల్ కతాలో క్రాకర్స్ పై నిషేధం విధించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని చెప్పింది. ఇదే కోవలో తెలంగాణలో కూడా నిషేధం విధించాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.

More Telugu News