తేజస్వికి అధికారం అప్పగించి ఉంటే.. దానిని ఆయన తన తండ్రికి బదలాయించేవాడు: ఉమాభారతి

12-11-2020 Thu 07:54
  • తేజస్వి, కమల్‌నాథ్‌లపై ఉమాభారతి ప్రశంసలు
  • తేజస్వి చాలా మంచి కుర్రాడని కితాబు
  • కమల్‌నాథ్ వ్యూహాత్మకంగా పోరాడారన్న ఫైర్‌బ్రాండ్
Tejashwi Yadav A Very Good Boy says Uma Bharti
బీహార్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి ముచ్చెమటలు పట్టించిన లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌పై బీజేపీ సీనియర్ నేత ఉమాభారతి ప్రశంసల వర్షం కురిపిస్తూనే, రాష్ట్రాన్ని నడిపించేంత అనుభవం అతడికి లేదని అన్నారు. తేజస్వి మంచి కుర్రాడని పేర్కొన్న ఉమాభారతి.. ఒకవేళ ఈ ఎన్నికల్లో అతడు విజయం సాధించి ఉంటే ఆ అధికారాన్ని అతడు తన తండ్రికి బదలాయించి ఉండేవాడని అన్నారు. అదే జరిగి ఉంటే బీహార్ మళ్లీ జంగిల్ రాజ్‌గా మారుతుందని విమర్శించారు. తేజస్వికి ఇప్పుడే అధికారంలోకి రావాలన్న కోరిక అవసరం లేదని, కాస్తంత పెద్దయ్యాక అధికారంలోకి రావొచ్చని అన్నారు. 

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ను కూడా ఉమాభారతి ప్రశంసించారు. ఈ ఎన్నికల్లో కమల్‌నాథ్ వ్యూహాత్మకంగా పోరాడారని అన్నారు. కమల్‌నాథ్ తనకు అన్నయ్యలాంటి వారని, చాలా మంచి వ్యక్తి అని కొనియాడారు. ప్రభుత్వాన్ని ఆయన సమర్థంగా నడిపించి ఉంటే ఈ సమస్యలు వచ్చి ఉండేవి కావని ఉమాభారతి అన్నారు. కాగా, మధ్యప్రదేశ్‌‌లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ 9 చోట్ల విజయం సాధించగా, 19 స్థానాల్లో బీజేపీ జయకేతనం ఎగురవేసింది. ఫలితంగా శివరాజ్‌సింగ్ ప్రభుత్వానికి ఢోకా లేకుండా పోయింది.