Budda Venkanna: జగన్ గారూ.. పోలీసుల రూపంలో ఉన్న దోషులను శిక్షించండి: బుద్ధా వెంకన్న

  • నంద్యాల ఎమ్మెల్యే కనుసన్నల్లోనే సలాంపై తప్పుడు కేసులు పెట్టారు
  • వారి చావుకు కారణమైన వారిపై క్రిమినల్ కేసులు పెట్టండి
  • పోలీసులను కూడా ఈ ప్రభుత్వం విభజించి పాలిస్తోంది
Punish those police who are responsible for Salams family suicide says Budda Venkanna

కర్నూలు జిల్లా నంద్యాలలో సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్పందిస్తూ... రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడుస్తోందా? లేక జగన్ స్వామ్యం నడుస్తోందా? అనే అనుమానం కలుగుతోందని అన్నారు. అమరావతి రైతులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టే జగన్ ప్రభుత్వం... నలుగురి మరణానికి కారణమైన పోలీసులపై బెయిలబుల్ కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు.

చేయని నేరాన్ని ఒప్పుకోమంటూ సలాంని, ఆయన భార్యను డీఎస్పీ శివానందరెడ్డి, సీఐ సోమశేఖర్ రెడ్డి, కానిస్టేబుల్ గంగాధర్ రెడ్డి దారుణంగా హింసించారని చెప్పారు. నంద్యాల ఎమ్మెల్యే రవికిషోర్ రెడ్డి కనుసన్నల్లోనే సలాంపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. అమాయకుల చావులకు కారణమైన వారిపై క్రిమినల్ కేసులు పెట్టి, కఠిన శిక్ష పడేలా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  

సలీం, అతని భార్య ఎంతో మానసిక క్షోభను అనుభవించడం వల్లే.. వారి పిల్లలను సైతం తాళ్లతోకట్టి, రైలు కింద వేశారని వెంకన్న అన్నారు. చిన్నపిల్లల చావు కేకలు కూడా ముఖ్యమంత్రికి వినిపించడం లేదా? అని ప్రశ్నించారు. రూ. 25 లక్షల పరిహారమిచ్చి కేసును కప్పిపెట్టాలని జగన్ చూస్తున్నారని విమర్శించారు. ఈ ప్రభుత్వం మైనార్టీల మేలు కోరే ప్రభుత్వమే అయితే... పోలీసుల రూపంలో ఉన్న దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం పోలీసులను కూడా విభజించి పాలిస్తోందని మండిపడ్డారు.

More Telugu News