Bihar: బీహార్‌లో తాను మునిగి.. ఆర్జేడీ పుట్టి ముంచిన కాంగ్రెస్!

  • బలం లేకున్నా ఎక్కువ సీట్లలో పోటీ
  • కాంగ్రెస్ బలాన్ని అంచనా వేయలేకపోయిన తేజస్వి
  • 70 స్థానాలు కేటాయిస్తే 19 స్థానాల్లో మాత్రమే విజయం
Congress is behind the NDA win in Bihar

బీహార్‌లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు గతి తప్పాయి. మహాకూటమి అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందన్న అంచనాలు తేలిపోయాయి. బీహారీలు మళ్లీ ఎన్డీయేకే పట్టంకట్టారు. మహాకూటమి పరాజయానికి కాంగ్రెస్సే ప్రధాన కారణమన్న విషయం ఫలితాలను బట్టి అర్థం అవుతోంది.

ప్రజల్లో ఏమాత్రం బలం లేని ఆ పార్టీకి 70 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. అయితే, అది మాత్రం కేవలం 19 స్థానాల్లోనే విజయం సాధించగలిగింది. మిగతా చోట్ల ఎన్‌డీఏ, ఎంఐఎం, ఇతర పార్టీలు విజయ బావుటా ఎగురవేశాయి. కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో పోటీ చేయడం వల్లే ఎన్డీయే విజయం సాధించగలిగిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ జైలులో ఉండడం, మహాకూటమి సీఎం అభ్యర్థి, ఆయన తనయుడు తేజస్వి యాదవ్‌కు రాజకీయాలపై అంతగా పట్టులేకపోవడంతో కాంగ్రెస్‌కు అత్యధిక సీట్లు కేటాయించారు. ఈ ఎన్నికల్లో ఆర్జేడీ 144, సీపీఎం 4, సీపీఐ 6, సీపీఐఎంఎల్ 19 స్థానాల్లో పోటీచేశాయి. ఇందులో సీపీఐఎంఎల్ ఏకంగా 11 స్థానాల్లో విజయం సాధించగా,  సీపీఎం 3, సీపీఐ 2 స్థానాల్లో విజయం సాధించాయి.

ఈసారి వామపక్షాల బలం పెరగడం కూడా మహాకూటమి సీట్లు పెరగడానికి కారణమైంది. అయితే, కాంగ్రెస్ మాత్రం తాను ఓడి మహాకూటమి పుట్టిముంచింది. తమ పార్టీకి అభ్యర్థులే లేని చోట్ల బలహీనమైన అభ్యర్థులను బరిలోకి దింపిందని, పార్టీ ఓటమికి అదే కారణమని ఆర్జేడీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పరిస్థితిని తేజస్వి అంచనా వేయలేకపోయారని, రాహుల్ గాంధీతో సాన్నిహిత్యం కారణంగా మొహమాటానికి పోయి ఆ పార్టీకి తేజస్వి ఎక్కువ సీట్లు అప్పగించారని ఆర్జేడీ నేతలు చెబుతున్నారు.

More Telugu News