Raghunandan Rao: నా గెలుపు సిద్ధిపేట పోలీస్ కమిషనర్ జోయెల్ డేవిస్ కు అంకితం: రఘునందన్ రావు

Raghunandan Rao speech after victorious in Dubbaka
  • దుబ్బాక ఉప ఎన్నికల్లో విజేత రఘునందన్ రావు
  • పోలీసులపై వ్యంగ్యం
  • ముగ్గురు పోలీస్ కమిషనర్లకు జీవితాంతం రుణపడి ఉంటానని వ్యాఖ్యలు
దుబ్బాక ఉప ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఫలితాల వెల్లడి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో తన విజయాన్ని సిద్ధిపేట పోలీస్ కమిషనర్ జోయెల్ డేవిస్ కు అంకితమిస్తున్నానని అన్నారు. ఎవరు ఇష్టపడ్డా, ఎవరు కష్టపడ్డా, ఎవరు కాదన్నా, ఔనన్నా తన విజయానికి అందరికంటే ఎక్కువగా కృషి చేసింది సిద్ధిపేట పోలీస్ కమిషనర్ జోయెల్ డేవిసేనని వ్యంగ్యం ప్రదర్శించారు.

జోయెల్ డేవిస్ తో పాటు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ కు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ద గ్రేట్ కు జీవితకాలం రుణపడి ఉంటానని వ్యాఖ్యానించారు. దుబ్బాక ప్రజలకు సేవ చేసుకునే అదృష్టం కల్పించిన పోలీసు మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు.  

అంతకుముందు ఆయన మాట్లాడుతూ, ఈ విజయం తన ఒక్కడిది కాదని వినమ్రంగా పేర్కొన్నారు. తన కోసం ప్రచారం చేసిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, సోయం బాబూరావు, సినీ నటుడు బాబుమోహన్... ఇలా అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని వివరించారు. దుబ్బాక ప్రజలకు చిత్తశుద్ధితో సేవలు అందిస్తానని అన్నారు.

ఈ విజయం సీఎం కేసీఆర్ పాలనకు రిఫరెండం వంటిదని రఘునందన్ రావు అభివర్ణించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తన గెలుపును కోరుకున్నారని, సీఎం కేసీఆర్ కు ఈ ఫలితం ఓ గుణపాఠం అని దుబ్బాక నుంచి డల్లాస్ వరకు భావిస్తున్నారని తెలిపారు.  

పోలింగ్ కు ముందు జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలోనే రఘునందన్ రావు పోలీసులను తన ప్రసంగంలో ప్రస్తావించినట్టు తెలుస్తోంది. రఘునందన్ రావు అనుయాయులు, బంధువుల ఇళ్లలో సోదాలు, పలు చోట్ల నగదు స్వాధీనం వంటి అంశాలతో దుబ్బాక ఉప ఎన్నికలు వాడీవేడి వాతావరణంలో జరిగాయి.
Raghunandan Rao
Speech
Dubbaka
By Polls
BJP
Telangana

More Telugu News