Tamilnadu: తమిళనాడులో జర్నలిస్టును కొట్టి చంపిన డ్రగ్ డీలర్లు!

Journalist Murdered in Tamilnadu
  • కాంచీపురం జిల్లాలో ఘటన
  • ఇటీవలే ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు
  • పోలీసుల తీరుపై మండిపడుతున్న ప్రజలు
తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో దారుణం జరిగింది. తమ కార్యకలాపాలకు అడ్డుగా నిలుస్తున్నాడన్న కారణంతో ఓ టీవీ చానెల్ జర్నలిస్టును మాదకద్రవ్యాల ముఠా దారుణంగా హత్యచేసింది. తనకు ప్రాణహాని ఉందని ఇటీవలే ఆ జర్నలిస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. అయినా, అతని ప్రాణాలు పోవడంతో జర్నలిస్టు, ప్రజా సంఘాలు పోలీసుల తీరుపై మండిపడుతున్నాయి.

వివరాల్లోకి వెళితే, కాంచీపురం సమీపంలో ఇజ్రాయెల్ మోజేస్ (27) అనే యువకుడు ఓ టీవీ చానెల్ లో పనిచేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం సోమంగళం పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఓ ఘటనలో మోజేస్ ను దారుణంగా కొట్టి చంపారు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఈ కేసులో నలుగురిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. అక్రమ భూ దందాలు, డ్రగ్స్ ను అమ్ముతున్న కొందరు ఈ దారుణానికి పాల్పడ్డారని, స్థానిక చెరువు వద్ద ఈ ఘటన జరిగిందని అన్నారు.

అయితే, ఇటీవలి కాలంలో మోజేస్, డ్రగ్స్ దందాపై ఎటువంటి వార్తలనూ టెలికాస్ట్ చేయించలేదని పోలీసు వర్గాలు అంటున్నాయి. బాధితుడి తండ్రి గంగరాజ్ స్పందిస్తూ, తన ప్రాణాలకు ముప్పు ఉందని మోజేస్ పోలీసులకు సమాచారాన్ని అందించినా, వారు పట్టించుకోలేదని ఆరోపించారు. గంగరాజ్ ఆరోపణలను ఖండించిన పోలీసు అధికారులు, మోజేస్ నుంచి అటువంటి ఫిర్యాదు తమకు రాలేదని స్పష్టం చేశారు. కేసును విచారిస్తున్నామని, దీని వెనుక ఎవరున్నా అరెస్ట్ చేస్తామని తెలిపారు.
Tamilnadu
Kanchepuram
Journalist
Murder

More Telugu News