America: తేజస్వి ముందు అనుభవజ్ఞుడైన నితీశ్ నిలబడలేకపోయారు: శివసేన

Saamanas editorial attacks BJP on Bihar Polls
  • అమెరికాలో ట్రంప్‌కు పట్టిన గతే బీహార్‌లో నితీశ్‌కు
  • అబద్ధాలు, అన్యాయాలు వ్యతిరేకంగా జరిగిన పోరులో తేజస్వి, బైడెన్ విజయం!
  • ఇప్పటికైనా భారత్ పాఠాలు నేర్చుకుంటే బెటర్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై శివసేన తన పత్రిక ‘సామ్నా’లో స్పందించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలే బీహార్‌లోనూ రిపీటవుతాయని సంపాదకీయంలో రాసుకొచ్చింది. అక్కడ ట్రంప్‌కు పట్టిన గతే  ఇక్కడ నితీశ్ కుమార్‌కు పడుతుందని హెచ్చరించింది.

 సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ ప్రచారం ముందు అనుభవజ్ఞుడైన నితీశ్ కుమార్ నిలబడలేకపోయారని, మోదీ, నితీశ్ ముందు బీహార్ ప్రజలు మోకరిల్లలేదని పేర్కొంది. అబద్ధాలకు, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడిన బైడెన్, తేజస్వి ఇద్దరూ విజయం సాధించినట్టే కనిపిస్తోందని పేర్కొంది. ట్రంప్ ఓటమితోనైనా భారత్ పాఠాలు నేర్చుకుంటే బాగుంటుందని మోదీ ప్రభుత్వానికి చురకలు అంటించింది.

అధ్యక్ష పదవికి ట్రంప్ అర్హుడు కాడన్న విషయం తెలుసుకున్న ప్రజలు నాలుగేళ్లలోనే ఆయనను గద్దె దింపి, చేసిన తప్పును సరిదిద్దుకున్నారని అన్నారు. అమెరికాలో కరోనా కంటే ఎక్కువగా ఉన్న నిరుద్యోగం విషయాన్ని ట్రంప్ పక్కన పడేసి రాజకీయాలు చేసి తగిన మూల్యం చెల్లించుకున్నారని విమర్శించింది. ఈ నాలుగేళ్లలో ట్రంప్ తానిచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోయారని దుయ్యబట్టింది.

ఇక అమెరికాలో అధికారం చేతులు మారినట్టుగానే బీహార్‌లోనూ మారుతుందని జోస్యం చెప్పింది. మనం తప్ప ప్రత్యామ్నాయం లేదన్న భ్రమలు ఆ నాయకులకు తొలగిపోవాలని పేర్కొంది. భారత్‌లో ‘నమస్తే ట్రంప్’ను ఎలా నిర్వహించినప్పటికీ అమెరికా ప్రజలు తెలివైన వారని, ట్రంప్‌కు వీడ్కోలు పలికి తమ తప్పును సరిదిద్దుకున్నారని సామ్నా తన సంపాదకీయంలో పేర్కొంది.
America
Bihar
Elections
Tejashwi Yadav
Shiv Sena
Nitish Kumar
Donald Trump
Narendra Modi

More Telugu News