తమన్నా వెబ్ సీరీస్ టైటిల్ 'ఎలెవెంత్ అవర్'.. పోస్టర్ విడుదల

09-11-2020 Mon 17:39
  • 'ఆహా' ఓటీటీ కోసం తమన్నా వెబ్ సీరీస్ 
  • 'గరుడ వేగ' ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం  
  • త్వరలోనే వెబ్ సీరీస్ స్ట్రీమింగ్
Tamannas web series poster out
కరోనా లాక్ డౌన్ సమయంలో థియేటర్లకు ప్రత్యామ్నాయంగా నిలిచిన ఓటీటీ ప్లేయర్స్ కు జై కొడుతున్న కథానాయికల్లో తమన్నా కూడా చేరింది. అటు సినిమాలతో పాటు, ఇటు ఓటీటీ వేదికలకు వెబ్ సీరీస్ చేయడానికి కూడా ఈ ముద్దుగుమ్మ ముందుకు వచ్చింది. ఈ క్రమంలో తాజాగా 'ఆహా' ఓటీటీ ప్లేయర్ కోసం ఓ వెబ్ సీరీస్ చేస్తోంది.

ఆమధ్య రాజశేఖర్ తో 'గరుడ వేగ' వంటి యాక్షన్ చిత్రాన్ని చేసిన ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ప్రదీప్ యు. నిర్మిస్తున్న ఈ వెబ్ సీరీస్ కి  'ఎలెవెంత్ అవర్' (11th  HOUR) అనే టైటిల్ని ఖరారు చేశారు. దీనికి సంబంధించిన టైటిల్ పోస్టర్ని ఈ రోజు విడుదల చేశారు. త్వరలోనే దీని స్ట్రీమింగ్ మొదలవుతుంది.

ఇదిలావుంచితే, ఇటీవల కరోనా బారిన పడిన తమన్నా ఇప్పుడు పూర్తిగా కోలుకుని మళ్లీ షూటింగులకు హాజరవుతోంది. మరోపక్క కొత్త సినిమాలకు కథలను కూడా వింటోంది.