మళ్లీ హీరోగా అవకాశం.. ఆలోచిస్తున్న సునీల్!

09-11-2020 Mon 10:39
  • గతంలో ఓసారి హీరోగా మారిన సునీల్ 
  • సక్సెస్ కాలేకపోయిన హాస్య నటుడు
  • 'బెల్ బాటమ్' రీమేక్ లో హీరోగా అవకాశం      
Sunil to act as a hero again
తెలుగుతెరపై కమెడియన్ గా సునీల్ ఓ కొత్త ఒరవడి సృష్టించాడు. అందుకే, అనతి కాలంలోనే అగ్ర హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక టైంలో ఏ సినిమాలో చూసినా తనే వున్నాడు. అలాంటి బిజీ సమయంలో ఉన్నట్టుండి హీరోగా మారాడు. అయితే, కొన్ని సినిమాలలో హీరోగా నటించినప్పటికీ, సక్సెస్ కాలేకపోయాడు. మళ్లీ ఎంతో ఆలోచించిన మీదట ఇటీవలి కాలంలో మళ్లీ హాస్య పాత్రలు పోషిస్తూ వస్తున్నాడు. ఇటీవల వచ్చిన 'కలర్ ఫొటో' సినిమాలో విలన్ గా కూడా నటించాడు.

ఈ క్రమంలో ఇప్పుడు మళ్లీ ఇతనికి హీరోగా ఓ అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది. గత ఏడాది కన్నడలో వచ్చిన 'బెల్ బాటమ్' చిత్రం హిట్టయింది. రిషబ్ శెట్టి, హరిప్రియ జంటగా నటించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో కథానాయకుడి పాత్రను పోషించాల్సిందిగా కోరుతున్నారట. ఈ విషయంలో సునీల్ ప్రస్తుతం తీవ్రంగా ఆలోచిస్తున్నాడనీ, త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటాడని అంటున్నారు.