Online Fruad: బాలుడితో తండ్రి ఫోనులో యాప్ ఇన్ స్టాల్ చేయించి... రూ. 9 లక్షలు నొక్కేశాడు!

  • బాలుడికి ఫోన్ చేసిన ఆగంతుకుడు
  • యాప్ లోడ్ చేస్తే క్రెడిట్ లిమిట్ పెరుగుతుందని ఆశ
  • కేసును విచారిస్తున్న పోలీసులు
Online Fruad Vanishes Nearly 9 Lakhs in Nagpur

మీ నాన్న సెల్ ఫోన్ లో ఈ యాప్ ను లోడ్ చేయాలంటూ ఓ బాలుడిని కోరిన ఆగంతుకుడు, తండ్రి బ్యాంకు ఖాతా నుంచి రూ. 9 లక్షల వరకూ నొక్కేశాడు. ఈ ఘటన నాగపూర్ లో జరిగింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, కోరాడీ ప్రాంతానికి చెందిన అశోక్ మన్వతేకు 15 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. సదరు బాలుడు ఇటీవల తండ్రి ఫోనును వాడుతున్నాడు. బుధవారం నాడు గుర్తు తెలియని ఓ నంబర్ నుంచి ఆ ఫోనుకి ఓ కాల్ వచ్చింది. తాను ఓ డిజిటల్ పేమెంట్స్ కంపెనీకి చెందిన ఎగ్జిక్యూటివ్ నని చెప్పుకున్న అతను, ఆ ఫోన్ మన్వతే బ్యాంకు ఖాతాకు లింక్ అయి ఉందని చెప్పాడు.

ఆపై ఓ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని, అప్పుడు క్రెడిట్ లిమిట్ పెరుగుతుందని చెప్పాడు. దీన్ని నమ్మిన బాలుడు అతను పంపిన లింక్ ను క్లిక్ చేసి, యాప్ ను ఇన్ స్టాల్ చేసుకున్నాడు. అంతే, ఆ వెంటనే ఫోన్ యాక్సెస్ ఆగంతుకుడి చేతుల్లోకి వెళ్లిపోయింది. మన్వతే బ్యాంకు ఖాతా నుంచి రూ. 8.95 లక్షలను లాగేసుకున్నాడు.

దీని గురించి తెలుసుకున్న మన్వతే లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. ఐపీసీ సెక్షన్ 419, 420లతో పాటు ఐటీ చట్టం ప్రకారం, కేసు రిజిస్టర్ చేశామని, ఆ డబ్బు ఏ ఖాతాలోకి వెళ్లిందో గుర్తించే పనిలో ఉన్నామని తెలియజేశారు.

More Telugu News