Chandrababu: చేయని నేరాన్ని ఒప్పుకోమని వేధించడంతో నంద్యాలలో నిండు కుటుంబం బలైపోయింది: చంద్రబాబు

Chandrababu questions AP government over Nandyala suicide incident
  • నంద్యాల ఆత్మహత్యలపై చంద్రబాబు స్పందన
  • ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్
  • ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడాలని స్పష్టీకరణ
కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్ సలాం, నూర్జహాన్ దంపతులు తమ పిల్లలతో సహా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. సలాం కుటుంబ సభ్యుల ఆత్మహత్యకు ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ముస్లింలను వేధింపులకు గురిచేస్తూ అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పేందుకు సలాం కుటుంబం ఆత్మహత్యే నిదర్శనం అని పేర్కొన్నారు.

"నాడు శాసనమండలిలో చైర్మన్ షరీఫ్ గారిని సభ్యులందరి ముందు మతం పేరుతో దూషించారు. రాజమండ్రిలో పదేళ్ల ముస్లిం బాలికపై అత్యాచారయత్నం చేసిన వారిపై కేసు పెడితే ఆ కేసు వెనక్కి తీసుకోవాలని వైసీపీ నేతలు ఒత్తిడి తెచ్చారు. దాంతో ఆ బాలిక తండ్రి సత్తార్ ఆత్మహత్య వరకు వెళ్లారు. ఇవాళ చేయని నేరాన్ని ఒప్పుకోవాలని అధికారులు వేధించడంతో ఒక నిండు కుటుంబం బలైపోయింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం దీనికి ఏమని సమాధానం చెబుతుంది?" అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

నంద్యాల ఆత్మహత్యల ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని, ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ముస్లిం మైనారిటీల పట్ల ప్రభుత్వం తన నిర్లక్ష్య వైఖరి వీడాలని స్పష్టం చేశారు.
Chandrababu
Nandyala
Suicide
Abdul Salam

More Telugu News