Kamala Harris: నేనే మొదటిదాన్ని... చివరిదాన్ని మాత్రం కాకూడదని కోరుకుంటున్నా: కమలాహారిస్

  • అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల పైచేయి
  • అధ్యక్షుడిగా బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ఎన్నిక
  • తల్లిని గుర్తు చేసుకున్న కమల
Kamala Harris emotional at her speech after victory

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల హవా బలంగా వీచిన సంగతి తెలిసిందే. అధ్యక్షుడిగా జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలాహారిస్ ఎన్నికయ్యారు. విజయానంతరం ప్రసంగించిన కమలా హారిస్ భావోద్వేగాలకు లోనయ్యారు. అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఓ మహిళ ఎంపిక కావడం ఇదే ప్రథమం అని, కానీ ఇదే చివరిసారి కాకూడదని, మహిళలు మరింత ముందంజ వేయాలని ఆకాంక్షించారు. తాను ఉపాధ్యక్షురాలిగా ఎన్నికవడం అమెరికా మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు. అమెరికాలో అందరికీ సమాన అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని చాటిచెప్పాలని అన్నారు.

తన తల్లి శ్యామల 19 ఏళ్ల వయసులో అమెరికా వచ్చారని, దేశంలో మహిళల భవిష్యత్తు ఎలా ఉంటుందన్నదానిపై ఆమె ప్రగాఢ విశ్వాసం చూపారని కమలాహారిస్ గుర్తుచేసుకున్నారు. ఇవాళ తాను ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం తన తల్లేనని, ఆమె ఎల్లప్పుడూ తమ హృదయాల్లో ఉంటుందని స్పష్టం చేశారు.

More Telugu News