Donald Trump: జో బైడెన్ ఖాతాలో పెన్సిల్వేనియా... అమెరికా 46వ అధ్యక్షుడిగా బైడెన్ ఖరారు!

  • బైడెన్ ఖాతాలో 284 ఓట్లు
  • అరిజోనాలోనూ గెలిచినట్టు వార్తలు
  • ఓటమిని అంగీకరించని ట్రంప్
Biden Wins US Presidential Polls

అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ఎవరన్న విషయమై గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరపడింది. యూఎస్ 46వ అధ్యక్షుడిగా జోసఫ్ రాబినెట్టి బైడెన్ జూనియర్ విజయం సాధించారు. దాదాపు నాలుగు రోజులకు పైగా ఓటింగ్ కొనసాగిన పెన్సిల్వేనియాలో బైడెన్ విజయం సాధించారని, దీంతో మెజారిటీకి కావాల్సిన 270 ఎలక్టోరల్ ఓట్లకు మించి ఆయనకు వచ్చాయని సీఎన్ఎన్, ఎన్బీసీ, అసోసియేటెడ్ ప్రెస్ వంటి వార్తా సంస్థలు వెల్లడించాయి. ఇక బైడెన్ తో పాటు ఈ ఎన్నికల్లో పోటీ పడ్డ 56 ఏళ్ల కాలిఫోర్నియా సెనేటర్ కమలా హారిస్, ఉపాధ్యక్షురాలిగా ఎన్నికకానున్న తొలి నల్లజాతి ఇండో అమెరికన్ మహిళగా నిలువనున్నారు.

ప్రస్తుతం 77 ఏళ్ల వయసులో ఉన్న ఆయన, 1992లో బిల్ క్లింటన్ తరువాత అధ్యక్షుడిని ఓడించిన రికార్డునూ సొంతం చేసుకున్నారు.1992లో హెచ్ డబ్ల్యూ బుష్ ను బిల్ క్లింటన్ ఓడించారన్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం బైడెన్ 284 ఓట్లను గెలుచుకున్నారని పలు వార్తా సంస్థలు తెలియజేస్తున్నాయి. ఆరిజోనాలోనూ బైడెన్ గెలిచారని తెలుస్తున్నా, పలు నెట్ వర్క్ లు దాన్నింకా ఖరారు చేయలేదు. ఆరిజోనాను పక్కనబెట్టినా, విజయానికి అవసరమైన 270 ఓట్లతో పోలిస్తే 273 ఎలక్టోరల్ ఓట్లు బైడెన్ ఖాతాలో ఉన్నట్టు. అయితే, ఇప్పటికీ, తన ఓటమిని అంగీకరించేందుకు ట్రంప్ సిద్ధంగా లేకపోవడం గమనార్హం.

More Telugu News