Sadhvi Prachi: మసీదులో హోమం చేస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సాధ్వీ ప్రాచి!

  • మధురలో ఆలయంలో నమాజులు
  • ఘాటుగా స్పందించిన సాధ్వీ ప్రాచి
  • మసీదులు కూల్చి హోమాలు చేయాలంటూ పిలుపు
  • ఆపై తన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్న వైనం
Sadhvi Prachi responds after Namaz offerings in a Madhura temple

ఉత్తరప్రదేశ్ లోని మధురలో నలుగురు వ్యక్తులు ఆలయంలో నమాజ్ చేయడం తీవ్ర దుమారం రేపడం తెలిసిందే. దీనిపై విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) నాయకురాలు సాధ్వీ ప్రాచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్నో నగరంలోని ఓ మసీదులో తాను హోమం చేస్తానంటూ ఘాటుగా స్పందించారు. సామాజిక మతసామరస్యం పేరిట ఓ ముఠా తన కార్యకలాపాలు కొనసాగిస్తోందని, ఈ ముఠా సభ్యులు ఆలయాల్లోకి వెళ్లి నమాజ్ లు చేస్తున్నారని ఆరోపించారు.

"వాళ్లు ఆ విధంగా చేస్తున్నప్పుడు హిందువులు కూడా మసీదులకు వెళ్లి హోమాలు చేయాలని మేం అనుకుంటున్నాం. ఆ విధంగా సామాజిక మత సామరస్యం నెలకొంటుందని భావిస్తున్నాం. హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి, అపవిత్రం చేసి ఆ మసీదులు నిర్మించారు. అందుకే ఆ మసీదులను కూల్చి అక్కడ హోమాలు చేయాలి. ఆ విధంగా నేనే చేస్తాను. లక్నోలోని ఓ పాత మసీదులో హోమం నిర్వహిస్తాను. తద్వారా వాయు కాలుష్యం తొలగిపోవడమే కాదు, సామాజిక మత సామరస్యం కూడా ఏర్పడుతుంది" అని వ్యాఖ్యానించారు.

సాధ్వీ ప్రాచి ఈ కార్యక్రమానికి బీజేపీ తదితర హిందుత్వ నేతలు రావాలంటూ ఆహ్వానించారు. కాగా, తన వ్యాఖ్యలను సాధ్వీ ప్రాచి కొన్నిగంటల్లోనే వెనక్కి తీసుకున్నట్టు సమాచారం.

More Telugu News